Rayapati Sambasiva Rao: గుంటూరు రాజకీయాల్లోనే కాకుండా.. ఏపీ రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు రాయపాటి సాంబశివరావు. కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. రాజ్యసభ సభ్యుడిగా.. పార్లమెంట్ సభ్యుడిగా. పార్లమెంటరీ కమిటీల చైర్మన్ గా కీలక బాధ్యతలను నిర్వర్తించారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీకి దూరమై.. టిడిపిలో చేరారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో ముఖ్యమైన మలుపు.
1972లో రాజకీయాల్లోకి అడుగు
1943 జూన్ 7న గుంటూరు జిల్లాలోని ఉంగుటూరు గ్రామంలో జన్మించారు రాయపాటి సాంబశివరావు. 1972లో రాజకీయాల్లోకి వచ్చారు. వ్యాపార రంగంలో.. సామాజిక కార్యకారపాలలో చురుకుగా ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో క్రమంగా ఎదిగారు.
1982 లో రాజ్యసభ సభ్యుడిగా
రాయపాటి రాజకీయ జీవితంలో 1982లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆయనకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది. 1982 నుంచి 1988 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అప్పట్లోనే యువ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలను చేపట్టారు. ఏపీ కాంగ్రెస్ కమిటీ కోశాధికారిగా.. జనరల్ సెక్రెటరీ గా పనిచేశారు.
1996 లో పార్లమెంటు సభ్యుడిగా..
1996లో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. తొలిసారి పార్లమెంట్లో అడుగు పెట్టారు. అప్పటినుంచి గుంటూరు రాజకీయాల్లో ఆయన తన ప్రాబల్యాన్ని పెంచుకున్నారు.
వరుసగా నాలుగుసార్లు ఎంపీగా..
రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి నాలుగుసార్లు విజయం సాధించారు. 1996లో గుంటూరు నుంచి తొలిసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1998లో రెండవసారి గుంటూరు ఎంపీగా విజయం సాధించారు. 2004లో మూడోసారి గుంటూరు ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో నాలుగోసారి గుంటూరు నుంచి విజయం సాధించారు. ఈ నాలుగు ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు.
జలవనరుల పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా..
పార్లమెంటులో పలు కమిటీలో సభ్యుడిగా పనిచేసిన రాయపాటి సాంబశివరావు.. జల వరులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా బాధితులు నిర్వర్తించారు. ఆర్థిక వ్యవహారాలు.. విదేశీ వ్యవహారాలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన కమిటీలలో ఆయన పని చేశారు.
కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు
ఏపీ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని రాయపాటి సాంబశివరావు తీవ్రంగా వ్యతిరేకించారు. విభజన నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2014లో టిడిపిలో చేరారు.
నరసరావుపేట ఎంపీగా..
2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి 5వ సారి ఎంపీ అయ్యారు. కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి వచ్చిన తర్వాత ఆయనకు లభించిన తొలి ఎన్నికల విజయం అదే కావడం విశేషం.
2019లో ఓటమి
2019 ఎన్నికల్లో మరోసారి నరసరావుపేట నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. వైసిపి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లో ఆయన ఎంపీగా విజయం సాధించలేదు.
2024 ఎన్నికల్లో..
2024 ఎన్నికల సమయంలో గుంటూరు.. నరసరావుపేట పార్లమెంటు స్థానాలతో పాటు తన కుమారుడు రంగారావుకు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే టిడిపి అధిష్టానం ఆ అవకాశాలను కల్పించలేదు. ఈ పరిణమున నేపథ్యంలో రాయపాటి కుటుంబం రాజకీయంగా వెనుకబడిపోయింది.
నవంబర్ 29న రాయపాటి సాంబశివరావు గుంటూరులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన రాజకీయ ప్రస్థానంలో రాజ్యసభ సభ్యుడిగా.. ఐదు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు.