Toyota Innova Crysta : భారత ఆటోమొబైల్ మార్కెట్లో టయోటా ఇన్నోవా క్రిస్టాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ట్రిప్స్, టూరిస్ట్ క్యాబ్స్, ట్రావెల్స్, కార్పొరేట్ రవాణా వంటి విభాగాల్లో ఈ ఎంపీవీకి మంచి డిమాండ్ ఉంది. విశ్వసనీయత, సౌకర్యం, ఎక్కువ దూరం ప్రయాణించినా ఇబ్బంది కలగని డ్రైవింగ్ అనుభవం ఇన్నోవా క్రిస్టా ప్రత్యేకతలు. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టయోటా తాజాగా భారత మార్కెట్లో ఇన్నోవా క్రిస్టా లిమో ఎడిషన్ ను విడుదల చేసింది. ముఖ్యంగా ఫ్లీట్ ఆపరేటర్లు, కమర్షియల్ మొబిలిటీ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చింది.
ఈ కొత్త మోడల్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.19.95 లక్షలుగా నిర్ణయించింది. ఇందులో 7 సీటర్, 8 సీటర్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ట్రావెల్స్, టూరిస్ట్ క్యాబ్ రంగంలో ఇన్నోవా క్రిస్టాకు ఉన్న ఆదరణను మరింత పెంచుకునే ఉద్దేశంతో టయోటా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది.
ఇన్నోవా క్రిస్టా లిమో ఎడిషన్ ధరలు, వేరియంట్లు
టయోటా ఇన్నోవా క్రిస్టా లిమో ఎడిషన్ 7 సీటర్ మోడల్ ధర రూ.19.95 లక్షలు కాగా, 8 సీటర్ మోడల్ ధర రూ.19.99 లక్షలుగా ఉంది. ఈ ధరలు ఎక్స్‌షోరూమ్‌కు సంబంధించినవి. ఈ రెండు వేరియంట్ల మధ్య ప్రధానమైన తేడా రెండో వరుస సీట్లలో ఉంటుంది.
7 సీటర్ వెర్షన్‌లో రెండో వరుసలో కెప్టెన్ సీట్లు అందించారు. ఇవి ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన అనుభూతిని కలిగిస్తాయి. ఇక 8 సీటర్ వెర్షన్‌లో రెండో వరుసలో బెంచ్ సీటింగ్ ఉంటుంది. ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లాల్సిన ట్రావెల్స్, కమర్షియల్ వాహన వినియోగదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తాజా ధరల పెంపు తర్వాత ఇన్నోవా క్రిస్టా GX 7 సీటర్ ధర ఎంత ఉందో, లిమో ఎడిషన్ 7 సీటర్ ధర కూడా అంతే ఉంది. అంటే ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చినప్పటికీ ధర విషయంలో వినియోగదారులపై అదనపు భారం పడకుండా టయోటా జాగ్రత్త పడినట్లు కనిపిస్తోంది.
అదే పవర్‌ఫుల్ డీజిల్ ఇంజిన్
ఇంజిన్ విషయానికి వస్తే ఇన్నోవా క్రిస్టా లిమో ఎడిషన్‌లో సాధారణ క్రిస్టాలో ఉన్న 2.4 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌నే కొనసాగించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 150 హెచ్‌పీ పవర్, 343 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.
మైలేజీ విషయానికి వస్తే ఈ మోడల్ లీటరుకు 15 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. కమర్షియల్ అవసరాల కోసం ఎక్కువ దూరం ప్రయాణించే వాహన యజమానులకు ఈ ఇంజిన్ పనితీరు, ఇంధన సామర్థ్యం కీలకంగా మారనున్నాయి.
డిజైన్, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
డిజైన్ పరంగా ఇన్నోవా క్రిస్టా లిమో ఎడిషన్‌లో భారీ మార్పులేమీ చేయలేదు. ముందు భాగంలో బ్లాక్ కలర్ గ్రిల్‌పై సిల్వర్ హారిజాంటల్ స్లాట్స్ అందించారు. హాలోజన్ హెడ్‌ల్యాంప్స్, కింది బంపర్‌పై క్రిస్టా బ్యాడ్జింగ్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. అలాగే 16 అంగుళాల సిల్వర్ ఫినిష్డ్ అల్లాయ్ వీల్స్‌ను అందించారు.
ఇంటీరియర్ విషయానికి వస్తే ఫ్యాబ్రిక్ సీట్ అప్హోల్స్టరీ, ఎత్తును సర్దుబాటు చేసుకునే డ్రైవర్ సీటు, మాన్యువల్ ఏసీ వంటి ఫీచర్లు ఉన్నాయి. మూడు వరుసల ప్రయాణికులకు ఏసీ వెంట్స్ అందించారు. రెండు 12V పవర్ సాకెట్లు కూడా ఉన్నాయి.
టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ అందించారు. దీంతో ప్రయాణ సమయంలో స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసుకుని మ్యూజిక్, నావిగేషన్ వంటి సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు.
భద్రతకు ప్రాధాన్యత
సేఫ్టీ విషయంలోనూ టయోటా అవసరమైన ఫీచర్లను అందించింది. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్‌తో కూడిన ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా సదుపాయాలు ఇందులో ఉన్నాయి.
టయోటా వ్యూహంలో కీలకమైన లిమో ఎడిషన్
ఈ కొత్త మోడల్ విడుదలపై టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్, సర్వీస్, యూజ్డ్ కార్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సబరి మనోహర్ మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలకు పైగా ఇన్నోవా తన విశ్వసనీయత, సౌకర్యం, నాణ్యతతో వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించుకుందని తెలిపారు. ప్రొఫెషనల్ మొబిలిటీ కస్టమర్లు కూడా ఇన్నోవా ప్రయాణంలో కీలక భాగమని పేర్కొన్నారు. అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రత్యేక గుర్తింపుతో ఇన్నోవా క్రిస్టా లిమోను తీసుకొచ్చినట్లు వివరించారు.
కొత్త డిజైన్, అధునాతన ఫీచర్ల కంటే కమర్షియల్ వినియోగదారులకు అవసరమైన సౌకర్యం, విశ్వసనీయత, సీటింగ్ ఆప్షన్లపై టయోటా ఎక్కువ దృష్టి పెట్టింది. ముఖ్యంగా ట్రావెల్స్, టూరిస్ట్ క్యాబ్స్, కార్పొరేట్ రవాణా రంగంలో ఉన్నవారికి 7, 8 సీటర్ ఆప్షన్లతో ఈ మోడల్ మరో ప్రత్యామ్నాయంగా నిలవనుంది.