Homeబిజినెస్Loan burden after Diwali: దీపావళి తర్వాత దరువే.. ఈ లోన్లు అన్నీ భారమే..

Loan burden after Diwali: దీపావళి తర్వాత దరువే.. ఈ లోన్లు అన్నీ భారమే..

Loan burden after Diwali: పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలతో పాటు భారత ఆర్థిక వ్యవస్థను కూడా కలవరపెడుతున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం నెమ్మదిగా మన దేశంపై పడటం ప్రారంభమైంది. ఇప్పటికే దేశంలో ఇంధన ధరలు స్వల్పంగా పెరుగుతుండగా, రాబోయే దీపావళి పండుగ సీజన్‌ నాటికి బ్యాంకు వడ్డీ రేట్లు కూడా పెరిగి.. సామాన్యుడి జేబుకు భారీగా చిల్లు పెట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా మార్కెట్లో ఏర్పడే అనిశ్చితిని తట్టుకోవడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కఠిన చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే దీపావళి నాటికి ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను (రెపో రేట్) పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే గనుక జరిగితే, బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతాయి. ఫలితంగా సామాన్యులు తీసుకున్న హోం లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్లపై ఈఎంఐల (EMI) భారం భారీగా పెరిగి, నెలవారీ బడ్జెట్‌ తలకిందులయ్యే ప్రమాదం ఉంది.

పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ముందు దేశంలో ధరల సూచి 5.5 శాతంగా ఉండేది. కానీ 2026 ఏప్రిల్ నాటికి ఇది ఏకంగా 8.30 శాతానికి చేరుకుంది. ముడిచమురు ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు భారంగా మారనున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా ఎరువుల కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. రవాణా ఛార్జీలు, ఎరువుల కొరత ప్రభావం నేరుగా వ్యవసాయంపై పడి, రాబోయే రోజుల్లో నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది.

ఆర్థిక ఇబ్బందుల ప్రభావం ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాలపై స్పష్టంగా కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ, అక్కడి ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఉన్నతాధికారుల జీతాల్లో కోతలు విధించిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు కూడా ముందస్తు పొదుపు చర్యలు చేపట్టాయి. దేశ ఆర్థిక పరిస్థితిని గమనించిన ప్రధానమంత్రి సైతం అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని, పొదుపు పాటించాలని ఇప్పటికే పిలుపునిచ్చారు.

కొన్ని తాజా నివేదికల ప్రకారం.. దేశంలో ద్రవ్యోల్బణం (Inflation) రేటులో తెలంగాణ రాష్ట్రం 5.18 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి 4.41 శాతంతో, ఆంధ్రప్రదేశ్ 4.20 శాతంతో కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయి ద్రవ్యోల్బణం నమోదు కావడం స్థానిక మార్కెట్లపై ధరల ఒత్తిడిని స్పష్టం చేస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఆందోళన చెందడం కంటే ఆర్థికంగా అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటూ, పొదుపు వైపు అడుగులు వేయడం మంచిది. అయితే, గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు గనుక తగ్గితే, ద్రవ్యోల్బణం మళ్లీ అదుపులోకి వచ్చి దేశ ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునే అవకాశం ఉందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular