Jio Platforms: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తన ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీకి చెందిన టెలికాం విభాగం ‘జియో ప్లాట్‌ఫామ్స్’ అద్భుతమైన పనితీరును కనబరిచింది. డిజిటల్ సేవల విస్తరణ, కస్టమర్ల భాగస్వామ్యం పెరగడం వల్ల కంపెనీ ఆదాయంలో పటిష్టమైన వృద్ధి నమోదైనట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కో కస్టమర్ నుంచి వచ్చే ఆదాయం ఎంత? అన్న సందేహం చాలా మందికి కలుగుతుంది. ఆ వివరాల్లోకి వెళితె..
టెలికాం రంగంలో తన అగ్రస్థానాన్ని మరింత బలం చేసుకుంటూ జియో ప్లాట్‌ఫామ్స్ మొత్తం కస్టమర్ల సంఖ్యను 53.3 కోట్లకు చేర్చుకుంది. దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్ వేగంగా విస్తరించడం.. వినూత్న డేటా ప్లాన్‌లను ప్రవేశపెట్టడం ద్వారా కోట్లాది మంది కొత్త వినియోగదారులు జియో వైపు ఆకర్షితులయ్యారు. ఈ భారీ కస్టమర్ బేస్ కంపెనీ మార్కెట్ లీడర్‌షిప్‌ను మరోసారి నిరూపించింది.
టెలికాం కంపెనీల ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి అత్యంత కీలకమైన Average Revenue per User (ARPU) ఈ క్వార్టర్‌లో ఆకట్టుకునేలా ఉంది. జియో ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఒక్కో కస్టమర్ నుంచి నెలకు సగటున రూ. 215 చొప్పున ఆదాయం వస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. వినియోగదారులు అధిక డేటా ప్లాన్‌లను ఎంచుకోవడం, 5G సేవలను వినియోగించుకోవడం వల్ల ఈ ARPU మెరుగైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఆర్థిక ఫలితాల పరంగా జియో లాభాల్లో మంచి వృద్ధిని సాధించింది. పన్నుల చెల్లింపుల తర్వాత కంపెనీ నికర ఆదాయం 9.2 శాతం వృద్ధితో రూ. 7,764 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే కార్యకలాపాల సామర్థ్యం పెరగడం, ఖర్చుల నియంత్రణ, పెరిగిన ARPU వంటి అంశాలు ఈ స్థాయి లాభాలను సాధించడంలో కీలక పాత్ర పోషించాయి. మొత్తంగా చూస్తే ఈ ఏప్రిల్-జూన్ క్వార్టర్ ఫలితాలు జియో ప్లాట్‌ఫామ్స్ డిజిటల్ మరియు కమ్యూనికేషన్ రంగంలో సాధిస్తున్న స్థిరమైన ప్రగతికి అద్దం పడుతున్నాయి.
