IPO Investment : స్టాక్ మార్కెట్‌లోకి కొత్తగా వచ్చే కంపెనీల Intial Public Offering(IPO) లకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన వస్తోంది. మంచి బ్రాండ్, పెద్ద కంపెనీ, ప్రముఖ సంస్థ అనే పేరుతో చాలామంది వీటికి అప్లై చేస్తున్నారు. అయితే కంపెనీ పేరు, బ్రాండ్ ఇమేజ్ చూసి మాత్రమే పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఐపీవోలో పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, వాల్యుయేషన్, భవిష్యత్ వృద్ధి అవకాశాలను పూర్తిగా పరిశీలించాలి. అవేంటో చూద్దాం..
ఐపీవో అంటే?
ఒక ప్రైవేట్ కంపెనీ తన యజమాన్య వాటాలను (షేర్లను) మొదటిసారిగా సాధారణ ప్రజలకు విక్రయించి, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా కావడాన్ని ఐపీఓ అంటారు. దీనిని ‘గోయింగ్ పబ్లిక్’ అని కూడా పిలుస్తారు.ఐపీఓ ముఖ్య ఉద్దేశాలు వ్యాపార విస్తరణ కోసం కొత్త మూలధనాన్ని సేకరించడం.కంపెనీ యొక్క పాత అప్పులను తీర్చడం.కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో స్వేచ్ఛగా కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి వీలు కల్పించడం
ఎస్‌బీఐ ఫండ్స్ మార్కెట్లోకి వచ్చిన ఐపీవోకు భారీ స్థాయిలో స్పందన లభించింది. దీని ద్వారా దాదాపు రూ.9,813 కోట్లను సేకరించింది. అయితే ఐపీవో పరిమాణం పెద్దగా ఉండటం లేదా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ షేరు తప్పనిసరిగా మంచి పెట్టుబడి అవుతుందని అర్థం కాదు. కంపెనీకి ప్రజల్లో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్నప్పటికీ.. ఆ కంపెనీ షేరు ధర చాలా ఎక్కువగా ఉండొచ్చు. మార్కెట్‌లో కంపెనీకి ఉన్న పేరుకు, షేరు వాల్యుయేషన్‌కు సంబంధం ఉంటుంది కానీ రెండూ ఒకటే కాదు. అందుకే బ్రాండ్ పాపులారిటీతో పాటు కంపెనీ ఆర్థిక బలాన్ని కూడా పరిశీలించాలి.
ఐపీవోకు అప్లై చేసే ముందు మొదటగా కంపెనీ బిజినెస్ మోడల్‌ను అర్థం చేసుకోవాలి. కంపెనీకి ఆదాయం ఏ మార్గంలో వస్తోంది? ప్రధాన ఆదాయ వనరు ఏమిటి? భవిష్యత్తులో ఆ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉందా? కంపెనీ వ్యాపారం ఒకే రంగంపై ఆధారపడి ఉందా? లేక విభిన్న వ్యాపారాలు ఉన్నాయా? వంటి అంశాలను తెలుసుకోవాలి. కంపెనీ ఎలా డబ్బు సంపాదిస్తుందో అర్థం కాకుండా కేవలం ఐపీవో హైప్ చూసి పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం.
గత కొన్ని సంవత్సరాల్లో కంపెనీ ఆదాయం, లాభాలు ఎలా పెరిగాయో పరిశీలించాలి. రెవెన్యూ పెరుగుతున్నప్పటికీ లాభాలు పెరగకపోతే కారణం ఏమిటో తెలుసుకోవాలి. కంపెనీ భవిష్యత్తులో కొత్త మార్కెట్లలోకి వెళ్లే అవకాశం ఉందా? కొత్త ఉత్పత్తులు లేదా సేవలు తీసుకురానుందా? పోటీ సంస్థల నుంచి ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం ఉందా? వంటి అంశాలను కూడా గమనించాలి.
ఇన్వెస్టర్లు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా తెలుసుకోవాలి.ఐపీవో ద్వారా కంపెనీకి వచ్చే నిధులను ఏం చేయబోతున్నారు? వ్యాపార విస్తరణకు ఉపయోగిస్తారా? అప్పులు తీర్చడానికి ఉపయోగిస్తారా? కొత్త ప్రాజెక్టుల కోసం వినియోగిస్తారా? లేక ఇప్పటికే ఉన్న షేర్‌హోల్డర్లు తమ వాటాలను విక్రయిస్తున్నారా? అనే విషయాలను ఐపీవో డాక్యుమెంట్లలో పరిశీలించాలి. కంపెనీ భవిష్యత్ వృద్ధికి నిధులు ఉపయోగపడే విధానం కూడా ముఖ్యమే. అందువల్ల కంపెనీ లో ఇన్వెస్ట్ మెంట్ చేసేవారు కేవలం ఐపీవో మాత్రమే కాకుండా రీసెర్చ్ చేసి ముందుకు వెళ్లాలి.