YSRCP MLAs: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం కూటమి వైపు చూస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే ఈ జాబితాలో ఓ ముగ్గురు ఇప్పుడు తాజాగా చేరారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి టచ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నారా లోకేష్ తో మాట్లాడినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చకు దారితీస్తోంది. అసలు టిడిపికి టచ్ లోకి ఎవరు వచ్చారు. టిడిపి వారిని తీసుకుంటుందా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ఏదో జరుగుతోందన్న అనుమానాలు మాత్రం బలపడుతున్నాయి. ఒకరిద్దరూ టిడిపి ఎమ్మెల్యేల విషయంలో వివాదాలు నడుస్తున్నాయి. స్థానిక పరిస్థితుల దృష్ట్యా వారు లైన్ దాటి వ్యవహరిస్తున్నారు. అటువంటి వివాదాస్పద ఎమ్మెల్యేలకు వైసీపీ టచ్ లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వారు వైసీపీలోకి వెళ్లిన మరుక్షణం.. వైసీపీ నుంచి ఓ ముగ్గురు ఎమ్మెల్యేలను లాగేందుకు ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
* రిజర్వుడు ఎమ్మెల్యేలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో రాయలసీమ నుంచి ఏడుగురు ఉన్నారు. ప్రకాశం జిల్లా నుంచి ఓ ఇద్దరు గెలిచారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మరో ఇద్దరు ఉన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, బాల నాగిరెడ్డి, టి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, డాక్టర్ దాసరి సుధా, విశ్వేశ్వర రాజు, మత్స్యలింగం, అమర్నాథ్ రెడ్డి, విరూపాక్ష తదితరులు ఉన్నారు. అయితే ఇందులో రిజర్వుడు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు అధికం. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో అసెంబ్లీకి హాజరు కావడం లేదు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇందులో మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఈ నిర్ణయంతో విభేదిస్తున్నారు. వారంతా అసెంబ్లీకి వెళ్లాలని ఎక్కువగా కోరుకుంటున్నారు. కానీ ఆ కోరిక తీరడం లేదు.
* అదే జరిగితే మరుక్షణం..
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితులు కనిపించడం లేదు. కూటమి దూకుడుగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారం అందుతుంది. ఈ పరిస్థితుల్లో వైసీపీలో ఉండడం కంటే కూటమిలో చేరడం ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చిన వారు ఉన్నారు. ప్రధానంగా ఓ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు కూటమితో పాటు మంత్రి నారా లోకేష్ కు టచ్ లోకి వెళ్లినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. టిడిపిలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఎమ్మెల్యే పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. వైసిపి కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఓ నేత సైతం అక్కడి ఎంపీ తో తీవ్రంగా విభేదిస్తున్నారు. ఆయన సైతం వైసీపీకి దగ్గరవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఆ ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకుంటే మాత్రం వైసీపీ నుంచి ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు.. కూటమి వైపు రావడం ఖాయం అన్న ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే ఒక సంచలనమే.
