YSR Congress Fire Brands Silent: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి చాలామంది ఫైర్ బ్రాండ్లు ఉన్నారు. ఎందుకో గాని వారంతా ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. అసలు వారు యాక్టివ్ అవుతారా? లేదా? అనే చర్చ బలంగా నడుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంది. వారి అవసరం పార్టీకి ఏర్పడింది. అయినా సరే వారి పెద్దగా నోరు తెరవడం లేదు. ఏదో పార్టీలో ఉన్నాం అంటే ఉన్నాం అన్నట్టు ఉంది వారి వ్యవహారం. కనీసం నోరు తెరవడం లేదు కూడా వారు. కూటమి ప్రభుత్వం నుంచి నెయ్యి కల్తీ వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇటువంటి సమయంలో అండగా నిలవాల్సిన ఈ ఫైర్ బ్రాండ్లు అంతా ముఖం చాటేస్తుండడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. పార్టీ కష్టంలో ఉన్నప్పుడే స్పందించాలి కానీ.. పార్టీ బాగున్నప్పుడు ఎందుకులే అనే ప్రశ్న వినిపిస్తోంది.
Also Read: లోకేష్ తలచుకుంటే అంతే!
* బలమైన వాయిస్ ఏది?
ఎవరు అవునన్నా కాదన్నా నెయ్యి కల్తీ వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ డ్యామేజ్ జరిగింది. దానిని కంట్రోల్ చేసే పనిలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన వాయిస్ వినిపిస్తోంది. కానీ ఇది చాలడం లేదు. ఎవరో ఒకరిద్దరు మాత్రమే స్పందిస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రులు ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ వంటి వారు నోరు తెరవకపోవడం పై రకరకాల చర్చ నడుస్తోంది. 2014 నుంచి 2019 వరకు వైయస్సార్ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. 2019 నుంచి 2024 మధ్య అధికారంలో ఉన్నప్పుడు.. వీరు ఓ స్థాయిలో రెచ్చిపోయేవారు. అధినేత జగన్ పై ఈగ వాలనిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు అమాంతం పెద్దపెద్ద నిందలు, ప్రత్యర్థుల బలమైన ఆరోపణలు చేస్తున్నా స్పందించకపోవడం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది.
* ఆ నేతల కోసం ఆరా..
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది మాట్లాడతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడితేనే.. పార్టీ తరపున వాయిస్ వినిపిస్తేనే ఫలితం ఉంటుంది. అయితే వైసిపి హయాంలో ఫైర్ బ్రాండ్లుగా పేరు పొందిన ఈ నేతలంతా ఆడిన మాటలు రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు. అందుకే ఫలానా ఫైర్ బ్రాండ్ ఏమైపోయారు అని ప్రజలు ఇప్పుడు ఆరా తీయడం చూస్తున్నాం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఒకరిద్దరు నేతలు మాత్రమే మాట్లాడుతున్నారు. మిగతావారు మాత్రం ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్లకు ఏమైందని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఇందులో కొందరు తమ సొంత వృత్తులు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. పరిస్థితికి తగ్గట్టు బయటకు రావాలని భావిస్తున్నారు. అప్పటివరకు సైలెంట్ మోడ్ లో ఉండడమే ఉత్తమని ఒక నిర్ణయానికి వచ్చారన్నమాట