వైయస్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెదనాన్న ఆనంద్ రెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నేడు పులివెందులలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. అయితే ఆ కుటుంబంలో వరస విషాదాలు నెలకొంటున్నాయి. కొద్ది నెలల కిందట అనారోగ్యంతో వైయస్ జగన్ సోదరుడు కన్నుమూశారు. ఇప్పుడు ఆయన పెదనాన్న చనిపోయారు. వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి సోదరుడు ఈ ఆనంద్ రెడ్డి.
* రాజారెడ్డి సోదరుడి కుమారుడు..
వైయస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి. ఆయన సోదరుడు కొండారెడ్డి కుమారుడే ఆనంద్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి కి ఆనంద రెడ్డి వరుసకు అన్నదమ్ముడు అవుతారు. ఆనంద్ రెడ్డి భార్య సుశీలమ్మ గత ఏడాది కన్నుమూశారు. వీరికి సునీత అనే కుమార్తె ఉన్నారు. ఈరోజు పులివెందులలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మొదట్లో జగన్ సోదరుడు అభిషేక్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి సోదరుడు కుమారుడే అభిషేక్ రెడ్డి.
* వరుసగా విషాదాలు..
వైయస్ కుటుంబంలో వరుసగా విషాదాలు చోటు చేసుకోవడంతో వైసీపీ శ్రేణులతో పాటు ఆ కుటుంబ అభిమానుల్లో విషాదం అలుముకుంది. పులివెందుల అంటేనే వైయస్ కుటుంబానికి అడ్డా. ఉమ్మడి కుటుంబం గా నడుస్తూ వచ్చింది. పులివెందులలో తమకంటూ ఒక ప్రభావం చాటుకుంటూ వస్తోంది ఆ కుటుంబం. అయితే ఇటీవల ఆ కుటుంబంలో చీలిక కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబంలో వరుసగా విషాదాలు చోటు చేసుకోవడం గమనార్హం.