Nara Lokesh: ఏపీలో ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం ప్రత్యేకం. మొన్నటి ఎన్నికల ముందు వరకు రాష్ట్రంలో అదో సాధారణ నియోజకవర్గం. కానీ నారా లోకేష్ రికార్డు మెజారిటీతో గెలవడం, మంత్రి కావడం, పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుండడంతో మంగళగిరి నియోజకవర్గం స్వరూపమే మారిపోయింది. అన్ని రంగాల్లోనూ ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతోంది. తాజాగా లోకేష్ 18 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా ఓ రైతు బజార్ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోనే ఓ మోడల్ రైతు బజారు అక్కడ ఏర్పాటు కానుంది. అయితే ఒక్క రైతు బజార్ మాత్రమే కాదు చేనేతశాల, ఇతరత్రా మౌలిక వసతుల కల్పనలో లోకేష్ చూపుతున్న చొరవ అక్కడి ప్రజలను ఆకట్టుకుంటుంది. అయితే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి, తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోటగా ఉన్న మంగళగిరి ఇప్పుడు.. కచ్చితంగా లోకేష్ కంచుకోటగా మారింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతలా అక్కడ ప్రభావం చూపుతున్నారు నారా లోకేష్. మొత్తం పరిస్థితిని మార్చేశారు. తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారు. వైయస్ కుటుంబానికి పులివెందుల, చంద్రబాబుకు కుప్పం మాదిరిగా.. ఇప్పుడు లోకేష్ పేరు చెబితే మంగళగిరి అన్నట్టు పరిస్థితిని మార్చేశారు.
* నియోజకవర్గాన్ని ఎంచుకోవడం సాహసం..
ప్రతికూల పరిస్థితుల నడుమ మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు నారా లోకేష్. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ముందుగా ఎమ్మెల్సీ అయ్యారు నారా లోకేష్. తరువాత రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అయితే 2019 ఎన్నికల నాటికి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని భావించారు. దీంతో అంత వేర్వేరు నియోజకవర్గాల పేర్లు సూచించారు. కానీ లోకేష్ మాత్రం మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. దీంతో అంతా షాక్ కు గురయ్యారు. టిడిపి ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గంలో ఒకసారి మాత్రమే గెలిచింది. అక్కడ చేనేత కార్మికులు ఎక్కువ. వారు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ వచ్చారు. తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అటువంటి నియోజకవర్గాన్ని లోకేష్ ఎంచుకునేసరికి సన్నిహితులు సైతం వద్దని వారించారు. కానీ లోకేష్ మొండిగా ముందుకు పోయారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
* ఓటమితో హేళన..
మంగళగిరిలో ఓడిపోయేసరికి లోకేష్ మరింత పలుచన అయ్యారు. మంత్రిగా ఉంటూ ఓడిపోవడం ఏమిటని ప్రశ్నించేవారు ఉన్నారు. ముఖ్యమంత్రి కుమారుడు గా ఉండి ఓడిపోవడం ఏంటని చాలామంది ఎద్దేవ చేశారు. ఎమ్మెల్యేగా గెలవనోడు అంటూ హేళన చేసిన వారు ఉన్నారు. కానీ ఇవేవీ పట్టించుకోలేదు నారా లోకేష్. 2019 నుంచి 2024 మధ్య మంగళగిరి నియోజకవర్గాన్ని తరచూ సందర్శించేవారు. తన సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేపట్టేవారు. ఈ క్రమంలో మంగళగిరి ప్రజల్లో ఒక రకమైన చేంజ్ వచ్చింది. మంచి నేతను కోల్పోయాం.. అనవసరంగా ఓడించాం అనే బాధ వ్యక్తం అయింది. దీనికి తోడు తాను గెలిచి మంత్రిని అయితే మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. భవిష్యత్తు ముఖ్యమంత్రి అన్న భావన కూడా మంగళగిరి ప్రజల్లో ఉంది. అందుకే అఖండ మెజారిటీతో గెలిపించారు. నారా లోకేష్ ది రాష్ట్రంలోనే రెండో మెజారిటీ. దాదాపు 90 వేల ఓట్లకు పైగా మెజారిటీతో ఆయన గెలిచారు.
* రోల్ మోడల్ గా అభివృద్ధి..
గెలిచిన నాటి నుంచి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఒకవైపు పాలనతో.. మరోవైపు పార్టీపై దృష్టి పెట్టాల్సి రావడంతో నిత్యం బిజీగా ఉండేవారు. అయినా సరే మంగళగిరి విషయంలో నిర్లక్ష్యం చేయడం లేదు. పైగా నియోజకవర్గంలో వారానికి ఒకసారి గ్రీవెన్స్ సెల్ పెట్టి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. వాటికి పరిష్కార మార్గం చూపుతున్నారు. నియోజకవర్గంలో నేత కార్మికులు ఎక్కువగా ఉండడంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చేనేత శాలను ఏర్పాటు చేశారు. అన్ని రంగాల్లో మంగళగిరిని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నారు. లోకేష్ ద్వారా తమకు మంచి పాలన, అభివృద్ధి కనిపిస్తుండడంతో మంగళగిరి ప్రజలు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. మంగళగిరి అంటేనే లోకేష్.. లోకేష్ అంటే మంగళగిరి అన్నట్టు ప్రస్తుత పరిస్థితి ఉంది.
View this post on Instagram