Vijayasai Reddy New Party: ఏపీలో ఒక కొత్త రాజకీయ పార్టీ రాబోతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటన చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు. విజయవాడ వేదికగా పార్టీ పేరు, అజెండా ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటివరకు అనేక సందేహాలు ఉన్న తరుణంలో ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే విజయసాయిరెడ్డి ప్రకటన చేయడంతో.. ఇక కొత్త పార్టీ ఖాయం అని తేలిపోయింది. అయితే దేశంలోనే పేరు మోసిన ఆడిటర్ విజయసాయిరెడ్డి. ప్రస్తుతం రాజకీయాల గురించి తెలుసు కాబట్టి ఆయన ఏదో సడన్గా అధికారంలోకి రావాలని పార్టీ పెడతారని ఎవరూ ఊహించరు. కచ్చితంగా దాని వెనుక ఏదో ఒక బలమైన కారణం.. అంతకుమించి ప్రయోజనాలు ఉంటాయి అనేది ఒక బలమైన వాదన. మూడే మూడు కారణాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఒకటి ముంచుకొస్తున్న కేసుల నుంచి విముక్తి.. రెండు కేంద్ర పెద్దల ప్రాపకం.. మూడు తనను వదులుకున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడం.. ఈ మూడు కారణాలు మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నాయి.
* కేసులకు రక్షణ కవచంలా..
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు వెనుక తన పైన ఉన్న కేసులకు రక్షణ కవచంగా పార్టీని తీర్చిదిద్దడమే. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో నెంబర్ 2 గా ఎదిగారు విజయసాయిరెడ్డి. ఆ సమయంలో ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఉంటూ భారీగానే సంపాదన చేశారు. విశాఖ వేదికగా జరిగిన అక్రమాల పర్వం వెనుక ఆయన హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూటమి పట్టు బిగిస్తుంది అన్న విషయం ఆయనకు తెలుసు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు సైతం మళ్లీ తెరపైకి వస్తున్నాయి. వీటన్నింటికీ ఒక రక్షణ కవచంలా తన కొత్త పార్టీని తీర్చిదిద్దే పనిలో ఉన్నారు విజయసాయిరెడ్డి. ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉంటే ఒకలా ఉంటాయి చట్ట పరిమితులు. సాధారణ పౌరుడి విషయంలో ఒకలా ఆలోచన ఉంటుంది. అందుకే ఈ పార్టీ ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశం తన కేసుల కోసమే అనే టాక్ ఉంది.
* కేంద్ర పెద్దల ప్రాపకం కోసం..
మరోవైపు రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది. కేంద్రంలో ఎన్డీఏ కొనసాగుతోంది. బిజెపిలో చేరాలనుకున్న తన విషయంలో కూటమిపరంగా అభ్యంతరాలు వచ్చాయి. అందుకే వెనక్కి తగ్గారు. అయితే కేంద్ర పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం కొనసాగాలి అంటే తాను ఒక రాజకీయ ప్రత్యామ్నాయం కావాలి. ఏపీలో కూటమికి.. కేంద్రంలో ఎన్డీఏ కు ప్రయోజన కారిగా మారాలి. ఇప్పుడు పార్టీ ఏర్పాటు చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటును కొంతవరకు చీల్చి.. ఏపీలో కూటమికి, కేంద్రంలో ఎన్డీఏ కి దగ్గర కావడమే ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
* వైసిపి కోటరీ పై..
మూడో కారణంగా జగన్మోహన్ రెడ్డి అని తెలుస్తోంది. కోటరీని నమ్మి తనను నిర్లక్ష్యం చేయడానికి జీర్ణించుకోలేకపోతున్నారు విజయసాయిరెడ్డి. పైగా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత తిరిగి ఆహ్వానం లేకుండా పోయింది. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారిని నమ్మిన జగన్ ఆయన కోసం పనిచేసిన తనను మాత్రం నమ్మడం లేదన్న బాధ విజయసాయిరెడ్డి లో ఉంది. పైగా వైసిపి బలం బలహీనతలు విజయసాయిరెడ్డికి తెలుసు. అందుకే వైసీపీలో అసంతృప్త నేతలను తన వైపు తిప్పుకునేందుకు కొత్త పార్టీ ఏర్పాటు చేశారన్నది ఒక అభిప్రాయం మాత్రమే.. ఇలా విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు వెనుక రకరకాల చర్చ నడుస్తోంది.