Gnaneshwari Missing Case: తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. దాదాపు 70 రోజులవుతోంది. జూన్ 6న ఇంటి సమీపంలోని పామాయిల్ తోటలోకి వెళ్లిన జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయింది. వందలాది మంది పోలీసులు ఆమె కోసం జల్లెడ పట్టారు. క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. రకరకాల ప్రయోగాలు చేశారు కానీ ఆమె ఆచూకీ దొరకలేదు. 70 రోజులు గడుస్తుండడంతో ఆమె ఆచూకీ లేకపోవడంతో ఆశలు గల్లంతవుతున్నాయి. కానీ జ్ఞానేశ్వరి తండ్రి మాత్రం తన కుమార్తె దొరుకుతుందన్న ఆశతో గట్టి ప్రయత్నం లోనే ఉన్నారు. ఏకంగా తన కుమార్తె కోసం ఓ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. తన కూతురి ఫోటోలతో పాటు జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు అందులో అప్లోడ్ చేస్తున్నారు. కనీసం ఇలాగైనా తన కుమార్తె ఆచూకీ దొరుకుతుందన్న ఆశ ఆ తండ్రిలో కనిపిస్తోంది.
* అన్ని కోణాల్లో దర్యాప్తు..
జూన్ 6న అదృశ్యమైంది జ్ఞానేశ్వరి. అప్పటినుంచి పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. చివరకు అనుమానితులు, సొంత కుటుంబ సభ్యులను సైతం పోలీసులు విచారించారు. చిన్నారి అదృశ్యమైన ప్రాంతం అటవీ ప్రాంతం కావడంతో.. వన్యప్రాణుల బారిన పడి ఉంటుందన్న అనుమానాలకు కోణంలో సైతం ప్రయత్నాలు చేశారు. ఇంకోవైపు చిన్నారి కుటుంబం పెంపుడు కుక్క అదృశ్యమైన మూడోరోజు మళ్లీ తిరిగి వచ్చింది. దీంతో అందరి ఆశలు చిగురించాయి. ఆ పెంపుడు కుక్క ద్వారా ఆచూకీ కనుక్కోవచ్చని పోలీసులు భావించారు. దురదృష్టవశాత్తు ఆ కుక్క కూడా చనిపోయింది. అప్పటినుంచి కేసు మరింత జఠిలం అయింది.
* కోర్టులో పిటిషన్..
అయితే జ్ఞానేశ్వరి జాడ 70 రోజులుగా కనిపించకపోవడంతో ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జ్ఞానేశ్వరి ఆచూకీ కనుక్కోవడంలో పోలీసులు వైఫల్యం చెందారని ఆపిటిషన్లో పేర్కొన్నారు. అయితే పోలీసుల ఐదు బృందాలుగా విడిపోయి చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలిస్తున్నారు అంటూ పోలీసుల తరపున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అసలు ఆ చిన్నారి ఆచూకీ కోసం ఏం చేస్తున్నారో చెప్పాలి అంటూ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంకోవైపు జ్ఞానేశ్వరి తండ్రి పోలీసులతో కలిపి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ పరిణామ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి.. అందులో ఫోటోలతో పాటు జ్ఞాపకాలను అప్లోడ్ చేస్తున్నారు. మరి ఆ తండ్రి ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.