Vijayawada Mayor: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు దూసుకొస్తున్నాయి. అక్టోబర్ లోపల పూర్తి చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు మొదలుపెట్టింది. అయితే ముందుగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. దాదాపు 100కు పైగా మున్సిపాలిటీలతోపాటు నగరపాలక పాలక సంస్థల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని చూస్తోంది. కూటమిపరంగా మున్సిపల్ ఎన్నికలపై మూడు పార్టీలు దృష్టిపెట్టాయి. ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో పట్టణాలతో పాటు నగరాల్లో తమ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించాలని చూస్తున్నాయి. అయితే ప్రధానంగా నగరాలపై కూటమిలో గట్టి పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే జనసేన పోటీ చేయబోయే నగరాలు ఇదేనంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఈ తరుణంలో ఆ పార్టీ నాయకత్వం స్పందించింది.. బహిరంగంగా ఎవరూ మాట్లాడవద్దని.. సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది. మరోవైపు విజయవాడ కార్పొరేషన్ మేయర్ పదవి విషయంలో ఆసక్తికర చర్చ ఒకటి జరుగుతోంది.
ఈసారి టిడిపికే ఛాన్స్..
విజయవాడ కార్పొరేషన్ మేయర్ గా ఈసారి తెలుగుదేశం పార్టీ నేత ఉండాలని ఆ పార్టీ పట్టుపడుతోంది. అయితే ఆ పార్టీలో చాలామంది ఆశావహులు ఉన్నారు. ప్రధానంగా బోండా ఉమామహేశ్వరరావు కుమారుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్నారు బోండా ఉమా. మంత్రి పదవి ఆశించారు కానీ దక్కలేదు. అందుకే హాట్ కామెంట్స్ చేశారు. మొన్ననే వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు తో వేదిక పంచుకోవడం వివాదాస్పదంగా మారింది. దీంతో హై కమాండ్ తో ఆయనకు గ్యాప్ ఏర్పడింది. ఈ తరుణంలో పార్టీ హై కమాండ్ బోండా ఉమాను పిలిచి.. వచ్చే ఎన్నికల్లో విజయవాడ మేయర్ గా కుమారుడి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్టు హామీ ఇచ్చింది. టిడిపి నుంచి ప్రముఖంగా ఆ పేరు మాత్రమే వినిపిస్తోంది.
నేరుగా టిడిపిలోకి తెచ్చి పోటీ..
మరోవైపు విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశా కిరణ్ రంగంలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. ఏడాది కిందట ఆమె యాక్టివ్ అయ్యారు. రంగా రాధా మిత్రమండలి పూర్వ వైభవం కోసం తహతహలాడుతున్నారు. అయితే ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ తర్వాత జనసేనలోకి వెళ్తారని టాక్ నడిచింది. ప్రస్తుతానికి ఆమె సోదరుడు వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఆయనకు త్వరలో ఎమ్మెల్సీ పదవి లభిస్తుందని కూడా ప్రచారం నడుస్తోంది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో వంగవీటి ఆశాకిరణ్ ను టిడిపిలోకి రప్పించి నేరుగా మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తారని కూడా ప్రచారం సాగుతోంది విజయవాడ పొలిటికల్ సర్కిల్స్లో. ఆమెను మేయర్ గా బరిలో దించడం ద్వారా వంగవీటి కుటుంబానికి గౌరవించినట్లు ఉంటుంది. అటు తరువాత రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారానికి వినియోగించుకోవాలన్నది కూటమి ప్రణాళికగా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..