Tomato price drop: అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్టు ఉంది ఏపీలో టమాటా రైతుల వ్యవహారం. పంట గిట్టుబాటు అయినప్పుడు మద్దతు ధర ఉండదు. మద్దతు ధర ఉన్నప్పుడు పంట పండదు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు, చీడపీడలు వెరసి రైతు పండిస్తున్న టమాటాకు సరైన గిట్టుబాటు దక్కడం లేదు. ఇప్పుడు టమాటా పరిస్థితి చూస్తుంటే.. పండించిన రైతు దుస్థితి చూస్తుంటే ప్రతి ఒక్కరికి గుండె తరుక్కుపోతుంది. పంట లేనప్పుడు కిలో 100 రూపాయలు ఉండే టమాటా ధర ప్రస్తుతం రెండు రూపాయలకు పడిపోయింది. కప్పు టీ కి నాలుగో వంతు అన్నమాట. పండించిన పాపానికి టమాటా పారేయలేక.. అమ్ముకోలేక అన్నదాత పడే బాధ అంతా కాదు. నెలరోజుల వ్యవధిలోనే టమాటా రైతు పరిస్థితి తలకిందులైంది.
రామభద్రపురం మార్కెట్లో..
టమాటా ( tomato ) పంటకు పెట్టింది పేరు మదనపల్లి. చిత్తూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో టమాటాను ఎక్కువగా పండిస్తారు. అలాగే ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో సైతం ఈ ఏడాది రికార్డు స్థాయిలో పండించారు. అతి పెద్ద మార్కెట్ గా ఉన్న రామభద్రపురంలో ధర లేక టమాటా రైతులు బేల చూపులు చూస్తున్నారు. అయితే గత అనుభవాల దృష్ట్యా ఈసారి టమాటా పంటను అధికంగా వేశారు. గతంలో నష్టాలు అధికంగా రావడంతో.. వాటిని భర్తీ చేసేందుకు గాను ఈసారి పంటను ఎక్కువగా వేసుకున్నారు. దిగుబడి కూడా భారీగా వచ్చింది. ఎకరాకు 15 టన్నుల పంట వస్తుందని అంచనా వేస్తే.. ఏకంగా 20 టన్నుల దిగుబడి రావడం విశేషం. అయితే ఈ దిగుబడిని సాకుగా చూపి తక్కువ ధరకు అడుగుతున్నారు వ్యాపారులు. దీంతో రైతులకు ఏం చేయాలో తెలియడం లేదు.
పెట్టుబడి రాని దుస్థితి..
ఆరుగాళం కష్టపడి రైతులు పంటను పండించుకున్నారు. ఎక్కడ సాగుకు మందులు, ఎరువులు, కూలీల ఖర్చు కలిపి సుమారు 50 వేలు వరకు ఖర్చు పెట్టారు. కానీ ప్రస్తుత టమాటా ధరలు చూస్తుంటే కనీసం 20వేల రూపాయల కూడా రాని దుస్థితి. దీంతో తనకు తీవ్ర నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు. కనీసం మార్కెట్ వరకు తీసుకురావడానికి అయ్యే రవాణా ఖర్చులు కూడా దొరకడం లేదు. ఆ రెండు రూపాయల కూడా మిగిలే పరిస్థితి లేదు. దీంతో పంటను కోయలేక రైతులు పొలాల్లోనే వాటిని విడిచిపెట్టారు. కొందరైతే పొలాల్లోనే కుప్పలుగా పోస్తూ వదిలేశారు. విజయనగరం జిల్లా రామభద్రపురం మార్కెట్లో రోజంతా నిరీక్షించినా టమాటా గురించి అడిగే నాధుడే కరువయ్యారని రైతులు చెబుతున్నారు. అయితే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.