Rs 2 per kg Tomato Farmers Crisis: ఎవరికైనా రెండు రూపాయలు బిక్షం వేస్తే చాలా అవమానకరంగా చూస్తుంటారు. అందుకే చేతిలో కనీసం ఐదు రూపాయలు ఉంటే కానీ బిక్షం వేయలేని రోజులు ఇవి. అటువంటిది కిలో టమాట అమ్ముతున్న రైతు చేతిలో రెండు రూపాయలు పెడుతున్నారు. ఇంతకంటే అవమానం ఏమి ఉంటుంది? అసలు రెండు రూపాయలతో ఏ వస్తువైనా దొరుకుతుందా? కానీ కిలో టమాటా కు రెండు రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో టమాటా రైతుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టమాటా రైతుల పరిస్థితి కూడా ఇదే.
ధరల స్థిరీకరణ లేదు..
రైతులు గణనీయంగా పండించినప్పుడు వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ఉండడం లేదు. రైతు దగ్గర పంట లేనప్పుడు వాటికి ధర విపరీతంగా ఉంది. ఇప్పుడు టమాటా పరిస్థితి కూడా అదే. గత ఏడాది అక్టోబర్ నవంబర్లో 60 రూపాయలకు పైగా కిలో టమాట ఉండేది. దీంతో రైతులు టమాటాకు స్థిరీకరణ ఉంటుందని భావించి గణనీయంగా సాగు చేశారు తెలుగు రాష్ట్రాల్లో. కానీ ఇప్పుడు కిలో టమాట రెండు రూపాయలు కూడా పలకడం లేదు. కనీసం కూలీల డబ్బులు రావడం లేదు. మార్కెట్కు తీసుకెళ్తామంటే రవాణా చార్జీలు కూడా రావడం లేదు. దీంతో రైతులు పొలాల్లోనే పంటను కోయకుండా విడిచిపెడుతున్నారు. కోసిన పంటను మార్కెట్కు తరలించకుండా రోడ్ల పక్కన పారబోస్తున్నారు. టమాటా రైతు పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంది.
టమాటా లేనిదే లేదు..
టమాటా( tomato ) లేని ఆహార పదార్థం లేదు. అస్సలు టమాటా లేని వంట లేదు. అంతలా తిరిగింది దాని వినియోగం. ధర ఎంత ఉన్నా ప్రతి ఒక్కరూ కొనుగోలు చేస్తుంటారు. అయితే టమాటా వినియోగం పెరగడంతో రైతులు కూడా విస్తృతంగా సాగు చేయడం ప్రారంభించారు. అయితే ధర ఉన్నప్పుడు పంట ఉండడం లేదు. పంట పండినప్పుడు ధర ఉండడం లేదు. గత ఏడాది అక్టోబర్, నవంబర్లో తీవ్ర వర్షాల నేపథ్యంలో టమాటా ధర అమాంతం పెరిగింది. 60 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కిలో టమాట పలికింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి టమాటా సరఫరా ఆగిపోవడం. తెలుగు రాష్ట్రాల్లో టమాటా పండక పోవడం వంటి కారణాలతో ధర విపరీతంగా పెరిగింది. అయితే గత అనుభవాల దృష్ట్యా రబీలో భాగంగా తెలంగాణతో పాటు ఏపీలోని చిత్తూరు, కర్నూలు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో టమాటాను విస్తారంగా సాగు చేసారు రైతులు. ప్రస్తుతం పంట దిగుబడి వస్తోంది. సాధారణంగా ఎకరా సాగు చేస్తే 15 క్వింటాల వరకు దిగుబడులు వస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం 20 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. కానీ పంట ఉత్పత్తి పెరగడంతో ధర తగ్గుముఖం పట్టింది. కేవలం రెండు రూపాయలు కిలో పలుకుతోంది. ఇది ఎంత మాత్రం రైతులకు గిట్టుబాటు కలగడం లేదు.
Also Read: తెలంగాణ సన్నబియ్యం.. ఆంధ్రాకు.. ఇదో పెద్ద స్కాం!
పెట్టుబడి, శ్రమ అధికం
సాధారణంగా ఎకరా టమాటా సాగుకు దాదాపు 30 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు కిలో టమాటా కేవలం రెండు రూపాయలు మాత్రమే. కనీసం పళ్ళను సేకరించి కూలీలకు ఇచ్చే వేతనానికి కూడా సరిపడదు. మార్కెట్కు తరలిస్తే రవాణా చార్జీలు కూడా రావడం లేదు. దీంతో ఏం చేయాలో టమాటా రైతుకు పాలుపోవడం లేదు. ఉత్తరాంధ్రలో అతిపెద్ద మార్కెట్ గా పేరుపొందింది రామభద్రపురం. విజయనగరం జిల్లాలోని రామభద్రపురం మార్కెట్లో ప్రస్తుతం ఎటుచూడు టమాటా కనిపిస్తోంది. ఇంకోవైపు పొలంలోనే టమాటా కోత కోయకుండా విడిచి పెడుతున్న రైతులు ఉన్నారు. పోసిన పంటను లేకుండా రోడ్ల పక్కన పారబోస్తున్న వారు ఉన్నారు. అంతలా దయనీయ పరిస్థితికి చేరింది టమాట రైతు పరిస్థితి.
విస్తారంగా సాగు..
గతంలో మదనపల్లె, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా టమాటాను పండించేవారు. కానీ ఒక్కోసారి టమాటా ధర పెరిగి రైతుకు బాగానే గిట్టుబాటు అవుతుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మెట్ట ప్రాంతాల్లో రైతులు టమాట సాగు చేయడం ప్రారంభించారు. అయితే శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టు ఉంది టమోటా రైతు పరిస్థితి. ధర స్థిరీకరణ లేదు. పంట చేతికొచ్చే వరకు గ్యారెంటీ ఉండదు. తీరా చేతికి వచ్చిన సమయానికి ధర ఉండడం లేదు. దీంతో ఒక్కసారి టమాటా సాగు చేసిన రైతులు మరోసారి దాని జోలికి పోవడం లేదు. ఒక టీ తాగితే పది రూపాయలు ఖర్చు అవుతోంది. కానీ అదే పది రూపాయలతో ఐదు కేజీల టమాటా లభిస్తుంది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. టమాటా రైతు పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో ఊహించుకోవచ్చు.