Nara Lokesh : ఏపీ రాజకీయాలలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చూపిస్తున్న తెగువ మామూలుగా లేదు. ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా కొనసాగుతూనే.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్లాన్లకు ఎక్కడికి అక్కడ చెక్ పెడుతున్నారు. తాజాగా జగన్ పాదయాత్ర చేస్తారని వైసిపి తెగ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. దానికి ప్రారంభంలోనే లోకేష్ చెక్ పెట్టారు.
2027 లో వాస్తవానికి ఏపీలో ఎన్నికలు జరగవు. అయితే 2027 లోనే పాదయాత్ర చేస్తానని జగన్ ఇప్పటికే ప్రకటించినట్టు తెలుస్తోంది. సరిగ్గా 2017 నవంబర్ 6న ఆయన పాదయాత్ర చేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లను గెలుచుకొని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి కూడా అదే ఫార్ములా రిపీట్ అవుతుందని జగన్ భావిస్తున్నారు. ఒకరకంగా ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందుగానే జగన్ పాదయాత్రకు ప్రణాళిక రూపొందించడం విశేషం.
గతంలో ఎన్నికలకు ఏడాదిన్నరకు ముందుగానే పాదయాత్ర ఫిక్స్ చేస్తే.. ఈసారి దాన్ని రెండు సంవత్సరాలకు ముందుగానే పొడిగించారు. గతంలో జగన్ 3700 కిలోమీటర్ల దాకా పాదయాత్ర చేశారు. ఈసారి ఏకంగా 5000 కిలోమీటర్లను టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈసారి పూర్తిగా గ్రామాల మీదుగా వైయస్ జగన్ పాదయాత్ర సాగుతుందని వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు రెండు సంవత్సరాలు ముందుగానే అంటే దాదాపు 730 రోజులు.. ఒకవేళ మధ్యలో జగన్ విశ్రాంతి తీసుకున్న సరే రోజుకు మూడు గ్రామాలను కవర్ చేయాలని వైసిపి నేతలు డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. వైసిపికి గ్రామీణ ప్రాంతాలలో ఓటు బ్యాంకు ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాలలోనే అధికంగా అమలు చేసినట్టు వారు గుర్తు చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు.. ఇతర సమీకరణాలు తనకు అనుకూలంగా ఉంటాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉంటుందని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే ఇప్పుడు టిడిపి అంతకు మించిన ప్రణాళికతో ఉంది. కేవలం వైసీపీ మీద ఉన్న నెగిటివిటీని మాత్రమే కాకుండా.. అమరావతి.. రాజధాని అభివృద్ధి.. మౌలిక సదుపాయాలు.. సాగునీటి ప్రాజెక్టులు వంటి వాటిని ప్రధానంగా ప్రచారం చేసుకుంటున్నది. మెరుగైన సంక్షేమం అందిస్తున్నామని ఇప్పటికే టిడిపి వివిధ వేదికలలో వైసిపి కి చెక్ పెట్టే విధంగా ప్రచారం చేస్తోంది. వైసీపీ ప్రణాళికలకు గట్టిగానే దెబ్బకొట్టే విధంగా అడుగులు వేస్తోంది. ఒకవేళ ఇప్పుడు టిడిపి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమానికి ఎక్కువ ఇస్తామని వైసిపి చెబితే ప్రజల్లో కొత్త సానుకూలత వచ్చే అవకాశం ఉంది. అయితే కేవలం సంక్షేమ మాత్రమే కాకుండా.. అభివృద్ధి ఎజెండాను కూడా వైసిపి చూపించాల్సి ఉంటుంది.
ఏపీ రాజధాని విషయంలో వైసిపికి ఇప్పటికి ఒక క్లారిటీ లేదు. గతంలో మూడు రాజధానులు అన్నారు. ఆ తర్వాత విశాఖపట్నం అన్నారు. ఇప్పుడేమో మావిగన్ అంటున్నారు. ఒకవేళ మావిగన్ గురించి వైసిపి ఇప్పటికంటే ఎక్కువ ప్రచారం చేసినప్పటికీ.. అప్పటికే అమరావతి మొదటి దశ పూర్తవుతుంది. అలాంటప్పుడు వైసిపి మావిగన్ గురించి డప్పు కొట్టి చెప్పిన ప్రయోజనం ఉండదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీలో సాగునీటి ప్రాజెక్టులను వరుసగా ప్రారంభించుకుంటూ వెళ్తోంది. అంతేకాదు, పోలవరం కూడా పూర్తి చేస్తామని చెబుతోంది. ఎన్నికల నాటికి కొన్ని కీలకమైన ప్రాజెక్టులు కూడా పూర్తవుతాయని కూటమి నేతలు అంటున్నారు. అలాంటప్పుడు జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎలాంటి విమర్శలు చేస్తారు.. క్రెడిట్ చోరీ అంటూ ఒకవేళ జగన్ విమర్శలు చేసినప్పటికీ ఉపయోగము ఉండదు.
జగన్ చేస్తున్న పాదయాత్రకు కౌంటర్ గా.. ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా పాదయాత్ర చేస్తారని.. జగన్ పర్యటించిన ప్రాంతాలకు దగ్గరగానే లోకేష్ పాదయాత్ర కూడా సాగుతుందని కూటమినేతలంటున్నారు. జగన్ కూటమి ప్రభుత్వం మీద చేసే ప్రతి విమర్శకు లోకేష్ గట్టిగా బదులు చెబుతారని.. దీనికి సంబంధించి గట్టిగానే బ్లూ ప్రింట్ రూపొందించారని సమాచారం. సాధారణంగా ప్రతిపక్షం పాదయాత్ర చేస్తూ ఉంటుంది. కానీ ఏపీలో వైసిపికి ప్రతిపక్ష హోదా లేదు. కానీ ఇక్కడ చిత్రంగా అధికార పక్షంలో ఉన్న టిడిపి పాదయాత్ర చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రకారం చూసుకుంటే 2027 లో ఏపీ రాజకీయాలలో పెను ప్రకంపనలు చెలరేగడం ఖాయం.