Mekapati Family: తెలుగుదేశం పార్టీలో మళ్లీ చేరికలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది నేతలు టిడిపి తో పాటు కూటమి పార్టీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే సరైన సమయం కోసం వేచి చూస్తూ వస్తోంది టీడీపీ. అవసరం అనుకున్న క్రమంలో ఒక్కో నేత చేరిక ఉండాలని భావించింది. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బలమైన కుటుంబాన్ని టిడిపిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు పూర్తయినట్లు సమాచారం. త్వరలో ఆ బలమైన ఫ్యామిలీ టిడిపిలోకి రావడం ఖాయం అని తేలిపోయింది. దానిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
* పార్టీకి అంటి ముట్టనట్టుగా..
గత కొన్ని రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో అంటి ముట్టనట్టుగా ఉంది మేకపాటి ఫ్యామిలీ. రాజకీయాలపై కాకుండా వ్యాపారాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. రాజకీయంగా మనసు మారింది అని ఆ ఫ్యామిలీ పై ఒక ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగానే పరిస్థితులు ఉన్నాయి. ఆది నుంచి మేకపాటి ఫ్యామిలీ వ్యాపార రంగంలో స్థిరపడింది. కూటమి వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీ పై ఎటువంటి వివాదాలు కానీ కేసులు కానీ లేవు. వారి పని వారు చేసుకుంటున్నారు. కానీ వైసీపీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదనతో ఉన్నారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే జగన్ చుట్టూ ఉన్న కోటరీ మారాలని.. జగన్ వైఖరిలో మార్పు రావాలని కామెంట్స్ చేశారు మేకపాటి. అప్పటినుంచి ఆయన పార్టీ మారుతారు అన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. మధ్యలో ఆ ప్రచారానికి పడింది కానీ ఇప్పుడు మళ్లీ మొదలైంది.
* సుదీర్ఘ నేపథ్యం..
మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కి సన్నిహిత నేత. ఆ అభిమానంతోనే ఎంపీ పదవి విడిచిపెట్టి మరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి సైతం ఎంతగానో అభిమానం చూపారు ఆ కుటుంబం పై. మేకపాటి గౌతం రెడ్డికి క్యాబినెట్ మంత్రి పదవి ఇచ్చారు. కానీ ఆయన అకాల మరణం చెందారు. తర్వాత మేకపాటి విక్రమ్ రెడ్డికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. అంతకుమించి ఏ అవకాశం ఇవ్వలేదు ఆ ఫ్యామిలీకి. మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు నుంచి బలమైన నేతలు దూరం కావడంతో మేకపాటి రాజమోహన్ రెడ్డి తో పాటు ఆయన కుమారుడు విక్రమ్ రెడ్డికి టికెట్లు ఇచ్చారు. కానీ ఇద్దరూ ఓడిపోయారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో పెద్దదిక్కుగా ఉన్న మేకపాటిని పెద్దగా పట్టించుకోలేదట జగన్. దానిపైనే అసంతృప్తిగా ఉన్న మేకపాటి మొన్న మద్య జగన్ చుట్టూ ఉన్న కోటరి పై విమర్శలు చేశారు. అయినా సరే జగన్ పిలిచి మాట్లాడాక పోవడంతో పార్టీలో ఉండడం కంటే బయటకు వెళ్ళిపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన టిడిపిలో చేరిక ఖాయమన్న ప్రచారం సాగుతోంది. రాజ్యసభ పదవితో పాటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే వారసులకు రాజకీయ ప్రాధాన్యం ఇస్తామన్న హామీ తోనే ఆయన పార్టీ మారేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.