Kapu Meeting: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త కుల రాజకీయం మొదలుపెట్టింది. ముఖ్యంగా కాపులపై దృష్టి పెట్టింది. కాపుల్లో చీలిక వస్తే కానీ వచ్చే ఎన్నికల్లో కష్టమన్న నిర్ణయానికి వచ్చిన ఆ పార్టీ.. ఒక డేంజర్ గేమ్ మొదలుపెట్టింది. కాపు ఆత్మీయ సమావేశాల పేరుతో ఇప్పటికే వైసీపీ కాపు నేతలు రంగంలోకి దిగారు. త్వరలో ఉభయగోదావరి తో పాటు విశాఖ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. అయితే వైసిపి కాపు నేతలతో పోల్చుకుంటే కూటమి కాపు నేతలు అంత దూకుడు ప్రదర్శించడం లేదు. అదే విషయాన్ని సీఎం చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో సైతం ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తుంటే మిగతా మంత్రులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. తప్పకుండా కౌంటర్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. కానీ నేతల్లో చలనం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
* వారంతా దూకుడు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాపు నేతలుగా ఉన్నారు అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని వంటి వారు. అయితే వారు దూకుడుగా ముందుకు వెళుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన టాస్క్ ను అదే స్థాయిలో పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే వారికి ఆప్షన్ లేదు. రాజకీయంగా ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. వైసీపీని గెలిపిస్తేనే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వారు బలంగా భావిస్తున్నారు. అందుకే బలమైన ప్రయత్నం చేస్తున్నారు. కానీ కూటమి నుంచి ఆ స్థాయిలో కౌంటర్ లేకుండా పోతోంది.
* టిడిపి కూటమి నేతలు ఉన్నా..
టిడిపి కూటమికి సంబంధించి ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే.. కిమిడి కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, జ్యోతుల నెహ్రూ, మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, జనసేన నుంచి ప్రముఖ నేతలు ఉన్నారు. దాదాపు ఓ 40 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ కౌంటర్ ఇచ్చిన దాఖలాలు లేవు. అనవసరంగా కుల ప్రస్తావనలు ఎందుకులే అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంది. అయితే మొన్ననే పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నేతలకు ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు సైతం మంత్రివర్గ సమావేశంలో సహచరులకు దీనిపైనే నిలదీశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
* పవన్ చంద్రబాబు అలెర్ట్
కాపుల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డేంజర్ గేమ్ ఆడుతోంది. దీనిని గట్టిగా తిప్పి కొట్టకపోతే టిడిపి కూటమికి నష్టం. ఇప్పుడు సాయి కృష్ణ ఉదంతంతో మరింత రెచ్చిపోతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి సాయి కృష్ణ కు నేరచరిత ఉంది. ఆయనను వెనుకేసుకొస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండ కట్టాల్సిన అవసరం ఉంది. చట్టానికి విరుద్ధంగా ఒక నేరస్తుడ్ని లాకప్ డెత్ చేయడం అనేది నేరం. దానిపైనే ఇప్పుడు వైసీపీ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. త్వరలో ఉభయగోదావరి తో పాటు విశాఖలో భారీ బహిరంగ సభ పెట్టాలని చూస్తోంది. ఇప్పుడు పవన్ తో పాటు చంద్రబాబు అప్రమత్తం కావడంతో కూటమి కాపు నేతలు సైతం రంగంలోకి దిగుతున్నారు. గతంలో వైసిపి హయాంలో కాపులకు ఏ విధంగా అన్యాయం జరిగింది.. కూటమి వచ్చాక దక్కుతున్న గౌరవం పై కాపు సమాజానికి వివరించే ప్రయత్నం చేయనున్నారు. త్వరలో కూటమి కాపు నేతల సభ భారీగా ఉండబోతుందన్న టాక్ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
