consumer protection act 2019 : ఉద్యోగ, వ్యాపారాలకు లేదా ఇంట్లో అవసరాలకు చాలా వస్తువులు కొనుగోలు చేస్తుంటాం. అయితే ఇలాంటి సమయంలో కొన్ని డ్యామేజ్ వస్తువులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో కొంతమంది వ్యాపారులు ఒక్కసారి అమ్మిన వస్తువు వెనక్కి తీసుకోము.. లేదా ఎక్స్చేంజ్ లేదు అని బోర్డులు పెడుతుంటారు. అయితే వినియోగదారులకు చట్టపరంగా కొన్ని హక్కులు ఉన్నాయి. వస్తువు లోపభూయిష్టంగా ఉంటే లేదా సేవలో లోపం ఉంటే వినియోగదారుడు న్యాయం కోరే అవకాశం ఉంది. అలాంటి చట్టం ఏదో తెలుసుకోవాలని ఉందా? అయితే కిందికి వెళ్లండి..
ప్రస్తుతం భారతదేశంలో అమల్లో ఉన్న ప్రధాన చట్టం Consumer Protection Act, 2019. ఇది 2020 జూలై 20 నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి ముందు Consumer Protection Act, 1986 అమలులో ఉండేది. అయితే వినియోగదారుల హక్కులు, ఫిర్యాదులు, పరిహారాలకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం 2019 చట్టంలోని నిబంధనల ప్రకారమే అమలవుతున్నాయి. మనం ఏదైనా షాపుల్లో కొన్న వస్తువు డ్యామేజ్ అవడం.. ప్రకటించిన ఫీచర్లు లేకపోవడం వంటి సేవల్లో నిర్లక్ష్యం జరిగితే వినియోగదారుడు ఈ యాక్ట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేసినా, తప్పుదారి పట్టించే ప్రకటనల ద్వారా వస్తువు విక్రయించినా కూడా దీని పరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
చట్టం ప్రకారం ప్రతి సందర్భంలో దుకాణదారు తప్పనిసరిగా ఎక్స్చేంజ్ ఇవ్వాలనే నిబంధన లేదు. కానీ వస్తువులో నిజంగా లోపం ఉందని నిర్ధారణ అయితే పరిస్థితిని బట్టి రిపేర్, రీప్లేస్‌మెంట్ (ఎక్స్చేంజ్) సంబంధిత వినియోగదారుల కమిషన్ ఆదేశించే అవకాశం ఉంది. అయితే కేవలం నచ్చలేదు అంటే మాత్రం అది విక్రేత రిటర్న్ పాలసీపై ఆధారపడి ఉంటుంది.
వినియోగదారుడికి కొన్న వస్తువుపై సమస్యలు ఏర్పడితే.. దానిపై ఫిర్యాదు చేసే ముందు కొన్ని పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. వాటిలో కొనుగోలు బిల్లు, ఇన్‌వాయిస్, వారంటీ కార్డు, చెల్లింపు రసీదు, ఉత్పత్తి ఫోటోలు లేదా వీడియోలు వంటి ఆధారాలు తప్పనిసరిగా భద్రపరచుకోవాలి. మొదట విక్రేతకు లేదా తయారీ సంస్థకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం మంచిది. సమస్య పరిష్కారం కాకపోతే వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించవచ్చు.
ఫిర్యాదు నిజమని తేలితే లోపభూయిష్టమైన వస్తువును మార్చాలని, రిపేర్ చేయాలని, చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని లేదా నష్టపరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించవచ్చు. కొన్ని సందర్భాల్లో మానసిక ఇబ్బందులకు కూడా పరిహారం ఇవ్వాలని ఆదేశాలు రావచ్చు.