Pulivendula Municipal Elections: పులివెందులలో టిడిపికి అవకాశం ఉండదు. టిడిపి అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ ఎటువంటి సానుకూలత ఉండేది కాదు. పులివెందుల.. మాత్రమే కాదు ఉమ్మడి కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట. అటువంటి చోట పోటీ చేయడమే టిడిపికి గెలిచినంత సంబరం. కానీ, 2024 ఎన్నికల్లో టిడిపి దీన్ని పూర్తిగా మార్చేసింది. కడప జిల్లాలో పోటీ కాదు.. కడప జిల్లా నే దక్కించుకుంది. ఆ తర్వాత ఆ గెలుపును అక్కడితోనే వదిలిపెట్టలేదు.
ఈసారి ఏకంగా పులివెందులనే టార్గెట్ చేసింది. పులివెందుల మున్సిపాలిటీ 2005లో ఏర్పాటయింది. నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పులివెందుల ప్రాంతాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. వాస్తవానికి పులివెందులలో ఇప్పటివరకు మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి జెండా ఎగరవేసింది లేదు. 1995లో టిడిపి ఇక్కడ జెడ్పీ స్థానాన్ని గెలుచుకుంది. ఇక తర్వాత పులివెందుల మీద ఆశలు పూర్తిగా వదిలేసుకుంది.
- 2005లో మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే నాడు, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
- 2010లో మున్సిపల్ ఎన్నికలను టిడిపి పులివెందులలో బహిష్కరించింది.
- 2014లో వైసిపి 26 వార్డులకు.. 24 గెలిచింది. 2021 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి 33 వార్డులకు 33 సాధించింది.
- 2024లో పులివెందుల ప్రాంతంలో జరిగిన జడ్పిటిసి ఉపఎన్నికల్లో.. టిడిపి గెలిచింది.
- నాటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా రాలేదు.
- అలాగే కడప జిల్లాలోని ఒంటిమిట్ట జెడ్పిటిసి ఎన్నికల్లో కూడా టిడిపి భారీ మెజారిటీతో విజయం సాధించింది.
- పులివెందులలో జెడ్పిటిసి సభ్యుడు బ్రహ్మానందరెడ్డి కన్నుమూయడంతో.. ఉప ఎన్నిక జరిగింది.
- ఒంటిమిట్ట సభ్యుడు.. సిట్టింగ్ జడ్పీ చైర్మన్ అమర్ నాథ్ రెడ్డి వైసీపీ టికెట్ మీద రాజంపేట స్థానం నుంచి పోటీ చేసి, ఎమ్మెల్యేగా గెలిచారు.
- పులివెందులలో జడ్పీ ఉప ఎన్నికల్లో 15 పోలింగ్ కేంద్రాలలో మొత్తం 8,103 ఓట్లు పోలయ్యాయి.
- వైసిపి అభ్యర్థి హేమంత్ రెడ్డి కేవలం 685 ఓట్లు మాత్రమే సాధించారు.
- టిడిపి ఇన్చార్జి బీటెక్ రవి భార్య లతారెడ్డి 6,735 ఓట్లు సాధించి.. అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.
- ఒంటిమిట్ట స్థానంలో కూడా ఇలాంటి ఫలితాలు వచ్చాయి.
- టిడిపి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,154 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
- ఈయనకు 12,505 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్థి సుబ్బారెడ్డికి 6,351 ఓట్లు వచ్చాయి.
ఇక తాజా మున్సిపల్ ఎన్నికల్లో జగన్ తన సొంత బాబాయ్ భార్య ప్రమీలను పోటీలోకి దించారు. టిడిపి నుంచి గీతాకుమారి పోటీ చేశారు. ఇక్కడ 40 వార్డులలో వైసిపి కేవలం మూడు మాత్రమే గెలిచింది. టిడిపి 37 సొంతం చేసుకుంది. ప్రమీల మీద గీత దాదాపు 13,000 పైగా ఓట్లు తేడాతో విజయం సాధించారు. ఇక్కడ ఎన్నికలు సక్రమంగా జరగలేదని జగన్ ఆరోపించారు. తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. చివరికి ఆర్ వో కార్యాలయం ఎదుట ధర్నా కూడా నిర్వహించారు.
ఆపరేషన్ పులివెందులను టిడిపి 2024 నుంచి మొదలుపెట్టింది. ముందుగా కడప ఎమ్మెల్యేగా రెడ్డప్పగారి మాధవిని గెలిపించుకుంది. ఆ తర్వాత కడప జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన ప్రణాళిక ప్రారంభించింది. కడప జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. చివరికి పులివెందులలో కూడా శాశ్వత తాగునీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసింది. తద్వారా ఓటర్ల మనోగతాన్ని పూర్తిగా మార్చేసింది. అసలు పసుపు జెండా ఎగరడమే కష్టంగా ఉండే పులివెందుల ప్రాంతంలో.. మున్సిపల్ స్థానం మీద టిడిపి అభ్యర్థిని కూర్చోబెట్టడం మామూలు విషయం కాదు. కాకపోతే ఈ ఎన్నికల్లో పులివెందుల ప్రజలు వన్ సైడ్ గా ఓటు వేయడం నిజంగా మారిన రాజకీయ పరిణామానికి బలమైన నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు.