Markapuram: సృష్టిలో మాతృత్వం అనేది ఒక వరం. ముఖ్యంగా మానవ సమాజంలో ప్రతి మహిళ తాను తల్లి కావాలని కోరుకుంటుంది. దురదృష్టవశాత్తు అనారోగ్య కారణాల రీత్యా మాతృత్వానికి దూరం అయితే ఆ మహిళ పడే బాధ వర్ణనతీతం. అయితే ఓ మహిళ తాను ప్రసవిస్తే చనిపోతానని తెలిసి కూడా చలించలేదు. తన కడుపులో ఉన్న బిడ్డ ఈ లోకాన్ని చూడాలని పరితపించింది. ప్రసవిస్తే ఇద్దరిలో ఒకరి ప్రాణం నిలుస్తుందని వైద్యులు చెబితే.. బిడ్డ కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా త్యాగం చేసింది. మార్కాపురంలో వెలుగు చూసింది ఈ మానవీయ ఘటన.
* మార్కాపురం జిల్లాలో ఘటన..
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన గుంటు లీలమ్మ ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నారు. కుటుంబం కోసం ఆమె చాలా కాలంగా పెళ్లి చేసుకోలేదు. ఆమె వయస్సు 40 సంవత్సరాలు. 2018లో వివాహం చేసుకున్నారు. సుమారు ఎనిమిది సంవత్సరాలుగా ఆమెకు పిల్లలు లేరు. ఇటీవల గర్భం దాల్చడంతో కుటుంబ సభ్యులు ఎంతగానో సంతోషించారు. ఇంతలోనే పిడుగు లాంటి వార్త. మూడో నెలలో వైద్య పరీక్షలు చేయించుకున్న సమయంలో ఆమె గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. గర్భం కొనసాగించడం క్షేమం కాదని కూడా వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో స్టంట్ వేయడంతో పరవాలేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
* పట్టుబట్టి మరి..
ఇటీవల ఆమెకు నెలలు నిండాయి. కానీ ఆరోగ్య పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేదని.. ఆమె ప్రసవిస్తే తల్లి బిడ్డల్లో ఒకరిని మాత్రమే కాపాడు గలమని వైద్యులు తేల్చి చెప్పారు. అయితే లీలమ్మ మాత్రం తన బిడ్డనే కోరుకుంది. అందుకు సంబంధించి కన్సెంటు ఫారం మీద సంతకం చేయాలని భర్తను పట్టు పట్టింది. దీంతో కాదనలేక ఆయన అలాగే సంతకం చేసాడు. వైద్యులు ఆపరేషన్ చేయక పండంటి మగ బిడ్డ జన్మించాడు. ఆ శిశువును చూడకుండానే ఆమె మృతి చెందింది. ఒకవైపు పండంటి బిడ్డ, మరోవైపు విగత జీవిగా మారిన తల్లిని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు గుండెల విసేలా రోదిస్తున్నారు.