July 31 Deadline: అతి త్వరలో జూలై నెల ఎండ్ కానుంది. దీంతో కొన్ని ఆర్థిక, ప్రభుత్వ సేవలకు సంబంధించిన గడువులు ఈ నెల చివరి తేదీన నిర్ణయించారు. రేషన్ కార్డు ఈ కేవైసీ నుంచి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖల వరకు ఈనెల 31 లోపు అవసరమైన పనులు చేసుకోవాలి. లేకపోతే ఆ తరువాత చేయాలని అనుకున్నా.. భారీ ఫెనాల్టీ ఉండడంతో పాటు కొన్ని ప్రభుత్వ పథకాలను కోల్పోయే అవకాశం ఉంది. మరి ఈనెల చివరి వరకు గడువు ఉన్న మరికొన్ని ముఖ్యమైనవి ఏవో చూద్దాం..
ఆదాయపు పన్ను దాఖలు:
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సిన వారు జూలై 31 వరకు గడువు ఉంది. ఈ గడువు మిస్ అయితే ఆలస్య రుసుము, పన్ను బకాయిపై వడ్డీ వంటి అదనపు భారం పడే అవకాశం ఉందని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. కాబట్టి ఐటీఆర్ ఫారంను గడువు తేదీ లోపు చెల్లించే ప్రయత్నచేయాలి.
తత్కాల్ టికెట్లపై కొత్త నిబంధనలు:
ఆగస్టు 1 నుంచి రైల్వే స్టేషన్లలో తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం టోకెన్ల పంపిణీ వేళల్లో మార్పులు ఉంటాయని సమాచారం వైరల్ అవుతోంది. అందులో భాగంగా ఏసీ తత్కాల్ టికెట్లకు ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు, నాన్ ఏసీ టికెట్లకు ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు టోకెన్లు ఇస్తారని చెబుతున్నారు. అయితే ఈ మార్పుపై భారతీయ రైల్వే అధికారిక ప్రకటనను నిర్ధారించకుండా ప్రయాణికులు దీనిని తుది నిబంధనగా భావించకపోవడం మంచిది.
తెలంగాణ రేషన్ ఈ కేవైసీ:
తెలంగాణలో రేషన్ కార్డుదారుల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేసి ధ్రువీకరించే ఈ కేవైసీ ప్రక్రియకు సంబంధించి గడువు ఈ నెల 31 వరకే ఉందని అధికారులు తెలుపుతున్నారు. రేషన్ కార్డులోని కుటుంబ సభ్యుల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో కూడా లబ్ధిదారులు పరిశీలించుకోవాలి. ఇది పూర్తి చేయకపోతే భవిష్యత్తులో రేషన్ సేవలు లేదా లబ్ధి పొందడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండొచ్చని అధికారులు సూచిస్తున్నారు.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు కూడా..:
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ పొందిన లబ్ధిదారులు తమ ఈ కేవైసీని పూర్తి చేసుకోవడం చాలా అవసరం. అధికారిక పీఎంయూవై వెబ్సైట్లో ఆయిల్ కంపెనీ మొబైల్ యాప్ ద్వారా సెల్ఫ్ ఫేస్-బేస్డ్ బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ చేసే విధానాన్ని అందుబాటులో ఉంచారు.
అయితే ఈ అంశాల్లోనూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న తేదీలను మాత్రమే నమ్మకుండా.. సంబంధిత శాఖల అధికారిక వెబ్సైట్లు లేదా స్థానిక అధికారుల నుంచి గడువులను నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా ఐటీఆర్ గడువు పన్ను చెల్లింపుదారుడి కేటగిరీ ఫారంపై ఆధారపడి మారవచ్చు. కాబట్టి గడువు దగ్గరపడే వరకు వేచి ఉండకుండా అవసరమైన పనులను ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది.