Lingamaneni Ramesh: ఇటీవల రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు హైలైట్ అవుతున్నాయి. కొద్ది రోజుల కిందట జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కారణంగా ఒక యువతి దుర్మరణం పాలైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై రకరకాల ప్రచారం నడుస్తోంది. ఇటీవల రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు విషయంలో జరిగిన పరిణామాలు తెలిసిన విషయమే. ముఖ్యంగా వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు దారితీసింది. అటువంటి ఆరోపణ జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడిపై వచ్చింది. ఈనెల 16న హైదరాబాదులో లింగమనేని రమేష్ కుమారుడు సాంజుష్ నడిపిన కారు ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం పాలయిందని.. ఈ ఘటనలో ఆయన పట్టించుకోలేదని ఏవేవో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై లింగమనేని రమేష్ కుటుంబంతో పాటు హైదరాబాద్ పోలీస్ అధికారులు స్పష్టతనిచ్చారు.
* అదే కారులో ఆసుపత్రికి
వాస్తవానికి ఆరోజు జరిగిన ప్రమాదంలో ఒడిస్సా కు చెందిన గాయాల పాలయ్యింది. వెంటనే ఆమెను అదే కారులో ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు సైతం సాంజుష్ ను మూడు పరీక్షలు చేశారు. డ్రగ్స్ కు సంబంధించిన పరీక్షలు కూడా జరిపారు. ఈ మూడు పరీక్షల్లోనూ నెగిటివ్ వచ్చింది. ఇదే విషయాన్ని తెలంగాణ పోలీసులు సైతం ధ్రువీకరించారు. తాజాగా కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయంపై స్పష్టతనిచ్చారు.
* చికిత్స పొందుతూ మృతి..
ఈ ప్రమాదానికి సంబంధించిన ఘటన ఈ నెల 16న జరగగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. తాజాగా దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం నడుస్తోంది. అందుకే ఎంపీ లింగమనేని రమేష్ కుటుంబం స్పందించింది. ప్రమాద ఘటనపై ఎవరు ఊహాగానాలు చేయవద్దని.. వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి రాకముందే ఎలాంటి ముందస్తు తీర్పులకు రావద్దని విజ్ఞప్తి చేసింది. ఘటనకు సంబంధించి నిర్ధారణ కాని సమాచారాన్ని ప్రచారం చేయడం వల్ల ఇప్పటికే విషాదంలో ఉన్న బాధిత కుటుంబానికి మరింత ఇబ్బంది కలిగే అవకాశం ఉందని పేర్కొంది. ఘటనకు సంబంధించి ఏ విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయలేదని.. చట్టపరమైన ప్రక్రియ నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని లింగమనేని కుటుంబం స్పష్టం చేసింది. అయితే ఈ ఘటనపై లింగమనేని రమేష్ కుటుంబం, పోలీస్ శాఖ స్పందించి వాస్తవాలు వివరించే ప్రయత్నం చేయడం విశేషం.
View this post on Instagram