AP Home Stay Scheme: ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచన చేస్తోంది. పట్టణాల్లో హోమ్ స్టేలను తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ హోం స్టేలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు నిర్ణయించింది. ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పట్టణాల్లో హోం స్టేలను గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ఎవరికైనా ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా పట్టణాలకు పనులపై వచ్చేవారు ఉంటారు. నగరాలకు సంబంధించి సందర్శనకు, ఆలయాలకు, పర్యటనల కోసం వస్తుంటారు. అటువంటి వారికి తక్కువ ఖర్చుతో వసతితో పాటు భోజనం అందించేలా ఈ హోమ్ స్టేలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధపడుతోంది ఏపీ ప్రభుత్వం. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిచేలా ఏర్పాట్లు చేస్తోంది.
* పర్యాటకులకు సులువుగా..
విశాఖ నగరాన్ని తీసుకుందాం. ఇక్కడకు చాలామంది పర్యాటకులు వస్తుంటారు. వారికి సరైన వసతి ఎక్కడ దొరుకుతుందో తెలియదు. అందుకే అధిక ధర వెచ్చించి హోటల్ గదుల్లో దిగుతుంటారు. అటువంటి వారికి ఇబ్బంది లేకుండా ఈ హోం స్టేలను అందుబాటులోకి తెస్తే బాగుంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం. మరోవైపు సంక్రాంతి సంబరాల సమయంలోనూ వేలాది మంది ఇతర ప్రాంతాల నుంచి గోదావరి జిల్లాలకు వస్తుంటారు. అక్కడే ఉండి సంక్రాంతి వేడుకలను తిలకిస్తుంటారు. అయితే బంధుమిత్రులు ఉన్నవారు పర్వాలేదు కానీ.. లేని వారికి మాత్రం ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అటువంటి సమయంలో ఈ హోం స్టేలు అనేవి ఎంతగానో దోహదపడతాయి. సాధారణంగా ప్రముఖ ఆలయాలు సైతం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. వాటిని సందర్శించే సమయంలో సైతం వసతి సమస్య ఏర్పడుతుంది. అటువంటి వారికి సైతం హోమ్ స్టీలు ఎంతగానో ఉపయోగపడతాయి.
* తక్కువ ధరకు వసతి..
తక్కువ ధరకు పర్యాటకులకు వసతి కల్పించడంతో పాటు.. మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలి అనేది ఈ హోం స్టేల ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పట్టణ మహిళా సంఘాలు ఆధ్వర్యంలో పట్టణాల్లో హోం స్టేలు సిద్ధం చేసేలా కసరత్తు జరుగుతోంది. అయితే స్థానికంగా ఉన్న సంస్కృతి, సంప్రదాయాలు వారికి వివరించేలా బాధ్యతను కూడా అప్పగిస్తారు. ఎక్కడో అద్దెకు ఉన్నాం అన్న భావన లేకుండా.. అతిధులు మాదిరిగా ఆతిథ్యం పొందే వీలుగా ఈ హోం స్టేలు ఏర్పాటు చేయనున్నారు. ఎవరైనా ఆసక్తి ఉండి దరఖాస్తు చేసుకుంటే ముందుగా ఆ ఇళ్లను అధికారులు పరిశీలిస్తారు. దరఖాస్తు చేసుకున్న వారి సత్ప్రవర్తన కూడా పరిశీలించనున్నారు. వారిపై ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా ఉండకూడదు. అలాగే అతిధులకు సదుపాయాలు, గౌరవంగా వ్యవహరించడం వంటి అంశాలపై నిర్వాహకులకు శిక్షణ ఇవ్వనున్నారు.
* హోమ్ స్టేకు కనీసం ఒక బెడ్ రూమ్ రెండు పడకలతో.. గరిష్టంగా ఆరుగదులు 12 బెడ్లతో ఉండాలి. సదరు ఇంటి యజమాని తన కుటుంబంతో అదే ప్రాంతంలో నివాసం ఉండాలి. ఒకవేళ అనుబంధంగా ఉండే బెడ్, బ్రేక్ ఫాస్ట్ కోసం యజమాని, ప్రమోటర్ అదే ప్రాంతంలో నివా నివాసం ఉండాల్సిన అవసరం లేదు. అటువంటి వారు అతిధులకు అవసరం అయినా సేవలు అందించేందుకు ఒక ప్రతినిధిని నియమించుకోవాల్సి ఉంటుంది. కాగా దాదాపు అన్ని ప్రముఖ పట్టణాల్లో మెప్మా అధికారులు అప్పుడే కసరత్తు ప్రారంభించారు.