Kurma Village: ఆ గ్రామంలో విద్యుత్ ఉండదు.. టీవీ లతోపాటు సెల్ ఫోన్ల వినియోగం ఉండదు. ప్రస్తుత సమాజాన్ని కొంగదీస్తున్న ఎలాంటి అవ లక్షణాలు అక్కడ కనిపించవు. ప్రజలంతా బాహ్య ప్రపంచాన్ని ఆధ్యాత్మిక చింతనతో దర్శిస్తూ ప్రకృతి ఒడిలోనే సుఖంగా బతుకుతున్నారు. ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగాలతో సంపన్న శ్రేణి జీవనాన్ని అనుభవించినప్పటికీ.. జీవిత పరమార్ధం ఇది కాదని భావించిన వారంతా.. పరమాత్మకు చేరువయ్యే వికాస మార్గం.. సనాతన ధార్మిక జీవనంగా భావించి సరికొత్త జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు. కాలం మారుతున్న కొద్ది అలవాట్లు, పద్ధతులు మారుతూ ఉంటాయి. కాలం మనుషులను అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అయితే కాలానికి ఎదురు నిలుస్తూ పూర్తిగా పాత పద్ధతులను అనుసరిస్తూ విభిన్న జీవనాన్ని అనుసరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కూర్మ గ్రామ ప్రజలు..
* అంతా ప్రాచీన జీవనం..
పూర్తిగా ప్రాచీన వైదిక వర్ణాశ్రమ పద్ధతులు పాటిస్తూ ముందుకు సాగుతోంది కూర్మ గ్రామం. అక్కడకు వెళ్తే 100 సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులు కనిపిస్తాయి. భారతీయ గ్రామీణ జీవన విధానం, సంప్రదాయాలు, పద్ధతులు, ఆహారపు అలవాట్లు, కట్టుబొట్టు, వృత్తులు, వీటన్నింటినీ ఒకే చోట కలపోసినట్లుగా కనిపిస్తుంది కూర్మ గ్రామం. ఈ గ్రామాన్ని 2018 జూలైలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకాచార్యులైన భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు, వారి శిష్య బృందం ఏర్పాటు చేసింది. మొదట్లో కొద్ది మందితో ప్రారంభమైన కూర్మ గ్రామంలో ప్రస్తుతం 50 వరకు కుటుంబాలు, 100 మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. బ్రిటిష్ వారి ఏలు బడిలో భారతీయ వర్ణాశ్రమ వ్యవస్థ గాడి తప్పడంతో.. తిరిగి ప్రపంచాన్ని సనాతన ధర్మం వైపు మరల్చడమే ధ్యేయంగా కూర్మ గ్రామ ప్రజలు సంకల్పించి ఆ దిశగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
* ప్రకృతితో మిళితమైన జీవితం..
వందేళ్ళ క్రితం ప్రకృతి మిళితమైన జీవితాన్ని ప్రజలు అనుభవించేవారు. ప్రకృతితో కలిసి మనిషి జీవితం ఎలా అని భారతీయ సంస్కృతి చాటి చెప్పింది. అలాంటి జీవితానికి కూర్మ గ్రామం ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రకృతి సిద్ధ జీవితంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం కూర్మ గ్రామంలో పుట్టి పెరిగిన వారంతా ఉన్నత చదువులు చదువుకొని లక్షల్లో జీతాలు వచ్చే సంస్థల్లో పని చేసిన వారే. గొప్ప కుటుంబాల్లో పుట్టిన వారి. కానీ యాంత్రిక జీవితానికి విసుగు చెంది.. ప్రకృతితో మమేకమై పరమానందం పొందేందుకు కుటుంబ సమేతంగా అన్ని వదిలి.. కూర్మ గ్రామంలో నివసిస్తున్నారు. కార్లతోపాటు ఖరీదైన బంగ్లాలు ఉన్నా.. మట్టి ఇంటిలో, పూరి గుడిసెలో నివసిస్తున్నప్పుడే చాలా ఆనందంగా ఉందని మీరు చెబుతున్నారు. తమ కుటుంబాలను వదిలి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర దేశాల నుంచి కూడా పలువురు కూర్మ గ్రామానికి భగవంతుడి సేవ కోసం వస్తున్నారు.
* సరళ జీవనం..
సరళ జీవనం కూర్మ గ్రామం ప్రత్యేకం. నిత్య అవసరాలైన కూడు, గుడ్డ ప్రకృతి నుంచే పొందవచ్చు అని నిరూపిస్తూ.. ప్రకృతి సేద్యం తోనే వీటిని పొందుతున్నారు. ఏడాదికి వందలాది బస్తాల ధాన్యాన్ని ఎటువంటి రసాయనాలు వినియోగించకుండా.. పూర్తి సేంద్రియ విధానంలోనే సాగు చేస్తున్నారు. సరిపడా కూరగాయలను కూడా పండించుకుంటున్నారు. విత్తనం నాటింది మొదలు కోతల వరకు ఇతరులపై అసలు ఆధారపడరు. రసాయనాలు లేని వ్యవసాయంతో సొంతంగా నచ్చిన కూరగాయలు పండించుకుంటారు. పశుపోషణ కూడా చేస్తారు. తమ దుస్తులకు వారే నేత కార్మికులు.ఇళ్ల నిర్మాణానికి వారే మేస్త్రీలు, వారే కూలీలు. అలాగని ఇంటి నిర్మాణానికి సిమెంటు వాడరు. కూర్మ గ్రామంలో విద్య వర్ణాశ్రమ విధానంలో ఉంటుంది. విద్యార్థులు తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, హిందీలో అనర్గళంగా మాట్లాడుతారు. ఈ ఆశ్రమంలో తెల్లవారుజామున 4:30 గంటలకు దైవానికి హారతితో దినచర్య ప్రారంభమవుతుంది. కూర్మ గ్రామం నుంచి తెలుసుకున్న ఎంతోమంది ఇతర ప్రాంతవాసులు ఎక్కడకు వచ్చి పాటిస్తున్న పద్ధతులను చూసి మురిసిపోతుంటారు. మరి ఎందుకు ఆలస్యం ఒకసారి చూసొద్దాం రండి.