Jagan vs Chandrababu: ఏ రాజకీయ పార్టీ అయినా.. ఏ ప్రభుత్వం అయినా ఆలోచించేది ప్రజల మంచికే. ప్రజలకు సుపరిపాలన అందించాలన్నది పార్టీలు, ప్రభుత్వాల లక్ష్యం. అయితే మనం వెళ్లే విధానంలో తేడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులతో మూడు ప్రాంతాల ప్రజల అభిమానాన్ని చూరగొనాలని ప్రయత్నించారు. పాలనా వికేంద్రీకరణ పేరుతో ఆ ప్రతిపాదన తీసుకొచ్చారు. చంద్రబాబు మాత్రం మూడు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా సమాజంలో ఎక్కువగా ఉండే రైతుల్లో సంతృప్తి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ప్రజల తిరస్కరణ..
పాలనా వికేంద్రీకరణ పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు. అమరావతి రాజధాని అందరి ఆమోదంతో ఏకాభిప్రాయంతో ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి సైతం ఆమోదముద్ర వేశారు. రాయలసీమలో న్యాయ రాజధాని అన్నారు. విశాఖలో పాలన రాజధాని అన్నారు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తానని చెప్పారు. కానీ ఏ ఒక్క ప్రాంతం వారు కూడా జగన్మోహన్ రెడ్డికి అంగీకారం తెలపలేదు. అలాగని మూడు రాజధానులు కట్టలేకపోయారు. ఆ ప్రయత్నంలో కూడా విఫలమయ్యారు. ప్రజల తిరస్కరణకు గురయ్యారు.
సాగునీటి ప్రాజెక్టుల ప్రారంభం..
చంద్రబాబు కూడా ఇప్పుడు మూడు ప్రాంతాలపై దృష్టి పెట్టారు. కానీ అది అభివృద్ధి కార్యక్రమాల పరంగా. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి మూడు ప్రాంతాల్లో.. మూడు ప్రధాన ప్రాజెక్టులను నిర్మించి ప్రారంభించారు. హింద్రీనీవాతో రాయలసీమను సస్యశ్యామలం చేశారు. వెలుగొండ ప్రాజెక్టుతో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాదిమందికి తాగునీరు అందించారు. ఇక పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు పాగునీరుతో పాటు సాగునీరు అందించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా వరకు చేరింది గోదావరి నీరు. మిగతా విశాఖపట్నం, విజయనగరానికి సైతం చేర్చే ప్రయత్నం జరగనుంది. ఇలా మూడు ప్రాంతాల్లోనూ అభివృద్ధి ముద్ర వేసుకున్నారు. మూడు ప్రాంతాల్లో పాలన వికేంద్రీకరణ జరగాలన్నది జగన్ ప్రణాళిక అయితే.. మూడు ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని చంద్రబాబు వ్యూహం. అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనను ప్రజలు తిరస్కరించారు. ఇక్కడ చంద్రబాబు వ్యూహ చతురతను అభినందిస్తున్నారు. ప్రజలు స్వాగతిస్తున్నారు.