Andhra Pradesh Politics : మెగా డీఎస్సీ 2025 ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదా డీఎస్సీ అంటూ 2025 డిఎస్సి పై ఆరోపణలు చేస్తోంది. భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ తరుణంలో మెగా డీఎస్సీ 2025 ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. అందుకే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మొన్న ఆ మధ్యన రాయలసీమకు చెందిన ఉపాధ్యాయులు కర్నూలు కొండారెడ్డి బురుజు ఎక్కి నిరసన తెలిపారు. ఇప్పుడు విజయవాడలో ఆత్మగౌరవ ర్యాలీ చేపట్టారు. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి భారీగా ఉపాధ్యాయులు తరలివచ్చారు. ఈ సందర్భంగా డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు నేరుగా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు.
* తరలివచ్చిన వేలాదిమంది..
దాదాపు 7వేల మంది ఉపాధ్యాయులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రతిభతో ఉద్యోగం సాధిస్తే.. తమను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోంది అంటూ మండిపడ్డారు. ఆ పార్టీ విషప్రచారం వల్ల ఉద్యోగం సాధించిన సంతోషం కూడా లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు సైతం విశాఖలో భారీ నిరసన చేపట్టేందుకు సిద్ధపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల మందికి పైగా ఉపాధ్యాయుల భర్తీ అయిన సంగతి తెలిసిందే. వారంతా ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
* సోషల్ మీడియాలో వైరల్..
ఈ సందర్భంగా ఓ ఉపాధ్యాయుడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాను జగన్మోహన్ రెడ్డిని ఎంతగానో అభిమానించే వాడినని.. వీరాభిమానిని అని.. నా ఫోన్ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ కూడా జగన్మోహన్ రెడ్డి ఉండేదని.. అంతగా అభిమానించే వాడినని.. మరి అటువంటి జగన్ నా కృషితో సాధించిన ఉద్యోగాన్ని తప్పుగా మాట్లాడుతుంటే మరి అభిమానించనని.. ఇకనుంచి నా దేవుడు సిబిఎన్ అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆయనే కాదు మొత్తం ఉపాధ్యాయులంతా జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ అంటే రగిలిపోతున్నారు. అంబేద్కర్ స్మృతి వనం ఎక్కి మరి తమ నిరసనను తెలిపారు.