Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చే క్రమంలో భద్రత కల్పించడం ఏపీ పోలీసులకు కష్టతరంగా మారుతోంది. ఎందుకంటే జగన్ కార్యక్రమాలు అంటేనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. దీంతో ఏపీ పోలీసులకు అది ఇబ్బందికరంగా మారింది. దీనికి తోడు వైసీపీ శ్రేణులు అతిగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల పొగాకు రైతుల పరామర్శకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పొగాకు రైతుల సరుకును ధ్వంసం చేశారు. టిఫిన్ దుకాణాలు సైతం ధ్వంసమయ్యాయి. బాధితులు సోషల్ మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు కూడా. అయితే ఈ మొత్తం పరిణామాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలీస్ శాఖ పై పడేసింది. వారు భద్రత ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అంటూ చెబుతోంది. మరోవైపు కేంద్ర భద్రత కల్పించాలంటూ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
* వైవి సుబ్బారెడ్డి ఫిర్యాదులు..
ప్రస్తుతం ఢిల్లీలో వ్యవహారాలను చూస్తున్నారు వైవి సుబ్బారెడ్డి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు భద్రత ఇవ్వడం లేదని.. కావాలనే భద్రత తొలగిస్తోందని రాష్ట్ర ప్రభుత్వంపై వైవి సుబ్బారెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అమిత్ షాను కలిసి జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉందని ఫిర్యాదు చేశామని చెబుతున్నారు. పరామర్శలకు వెళితే అడ్డుకుంటున్నారని.. కనీసం సెక్యూరిటీ ఇవ్వడం లేదు అంటూ మీడియా ముందుకు వచ్చి భారీ ప్రకటనలు చేశారు వైవి. అయితే జగన్ బయటకు వస్తే ఏ స్థాయిలో ఆ పార్టీ ప్రణాళికలు ఉంటాయో తెలియనిది కాదు. డిజిటల్ మీడియా మొత్తం మోహరించి హైప్ చేసేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆ ప్రయత్నంలో భాగంగానే చాలా రకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాటిని ఏపీ పోలీసుల వైఫల్యంగా చెబుతున్నారు వైవి సుబ్బారెడ్డి.
* నిబంధనల ప్రకారం వెళ్లినా..
వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి బయటకు అడుగుపెడితే చాలు పార్టీ శ్రేణులకు పూనకం వచ్చేస్తోంది. ఉద్దేశపూర్వక జన సమీకరణ, రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తోంది. పోలీసులు తమ శాఖపరమైన విధుల్లో భాగంగా కాన్వాయ్ ను అడ్డుకోవడం , లేకుంటే సూచనలు చేస్తుండడంతో దానిని పర్యటనలను అడ్డుకున్నారన్న అపవాదు మోపుతున్నారు.. పోలీస్ వ్యవస్థను, రాష్ట్ర భద్రత వర్గాలను ఆత్మరక్షణలో పడేస్తూ ప్రతి అంశాన్ని రాజకీయ ప్రచారంగా వాడుకుంటున్నారు. ఈ విషయంలో వైసిపి మార్కు తెలివితేటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్రిక్త వాతావరణం సృష్టించి.. విక్రమ్ కార్డు ప్లే చేయడం.. అటు జాతీయస్థాయిలో ఫిర్యాదుల పేరుతో పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడం అనేది గతంలోనూ జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఈ విషయాన్ని గ్రహించారు కాబట్టి కేంద్ర పెద్దలు లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.