YS Jagan: గల్లీ నుంచి ఢిల్లీ వరకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీ. అందులోనూ ప్రజాక్షేత్రంలో ఉన్నవారు విధిగా జెండా వేడుకల్లో పాల్గొంటారు. జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేస్తారు. కానీ ఎందుకో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడ జెండా వందనంలో పాల్గొనలేదు. అందుకు సంబంధించిన దృశ్యాలేవి బయటకు రాలేదు. అసలు ఆయన జండా వందనంలో పాల్గొన్నారా? లేదా? అనే బలమైన చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆయన ఈరోజు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయానికి రాలేదు. అలాగని బెంగళూరులో ఉంటే అక్కడ జెండా ఆవిష్కరణ చేసినట్లు సోషల్ మీడియాలో ఎటువంటి ఫోటోలు లేవు. కేవలం స్వాతంత్ర దినోత్సవ ప్రాధాన్యత చెప్పుతూ ఓ ట్వీట్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి హాజరైన జండా వందనం కార్యక్రమాలు ఏవి కనిపించకపోవడం విశేషం.
* అధికారంలో ఉన్నప్పుడు..
అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లు అధికార లాంఛనాలతో.. గొప్ప వేడుకగా జరిపారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జగన్మోహన్ రెడ్డి. కానీ అధికారానికి దూరమైన తర్వాత ఇలా వేడుకలకు దూరం కావడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాల్గొని ఉంటే ఆ వీడియోలతో పాటు దృశ్యాలు బయటకు వచ్చేవి. కానీ అవి రాకపోవడంతో ఆయన గైర్హాజరైనట్టేనని ఎక్కువమంది భావిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నాడు పార్టీ కేంద్ర కార్యాలయానికి రాకుండా.. జగన్ ఎందుకు అలా వ్యవహరించారు అనేది ఇప్పుడు ప్రశ్న. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ద్వితీయ శ్రేణి నాయకులు జెండాను ఆవిష్కరించారు. కానీ జగన్మోహన్ రెడ్డి జాడలేదు. చిన్న చిన్న పార్టీ కార్యాలయాల వద్ద కూడా పార్టీ అధినేతలే జండా ఆవిష్కరణ చేశారు. మరి జగన్ మోహన్ రెడ్డి బెంగళూరులో ఉండిపోయారు కానీ.. అక్కడ జెండా వందనానికి సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు.
* ప్రత్యర్థులకు ప్రచార ఆస్త్రం..
అనవసరంగా ఇది రాజకీయ ప్రత్యర్థులకు ప్రచార అస్త్రంగా మారుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి. జగన్ వైఖరి వారికి కూడా అంతుపట్టడం లేదు. ఆయన రాజకీయ పర్యటనలతో పాటు సందర్శనలపై కూడా అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. పార్టీకి ఏది ప్రయోజనకరమో దానిపై కాకుండా.. పార్టీపై విమర్శలు వచ్చే పనులకు ఆయన ప్రాధాన్యం ఇస్తుండడంపై సొంత పార్టీ వారే తప్పుపడుతున్నారు. ఇప్పటికే విపరీతంగా ట్రోల్స్ కు గురవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇలాంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సైతం డుమ్మా కొట్టడం ద్వారా అనవసరంగా విమర్శల పాలవుతున్నారు. అయితే ఇప్పటికే దీనిపై వ్యతిరేక ప్రచారం ప్రారంభం కావడంతో.. జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా తాను పాల్గొన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన వీడియోలను కానీ.. ఫోటోలను కానీ విడుదల చేసే అవకాశమే ఉండేది. ఎందుకో ఆ పని చేయకపోవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.