AP Alliance Govt: కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. వరుసగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేస్తోంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి వరుస ప్రారంభోత్సవాలు చేయడం రాష్ట్రంలో సానుకూలత కనిపిస్తోంది. ముందుగా రాయలసీమలో హింద్రీనీవా, మొన్ననే పశ్చిమ ప్రకాశంలో వెలుగొండ, తాజాగా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. ఇలా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు చేస్తుండడం ప్రజల్లో ఒక రకమైన సంతృప్తి కనిపిస్తోంది. ఈ సంతృప్తిని తమకు కూడా పంచాలన్న ఆలోచన వైసిపి లో ఉంది. ఒకవైపు మా కృషి అంటూనే.. నిర్వాసితుల సమస్యలను, చిన్న చిన్న పొరపాట్లను సైతం భూతద్దంలో చూపి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కానీ ప్రజల్లో మాత్రం ఒక రకమైన సానుకూలత కనిపిస్తోంది.
రాయలసీమకు సాగునీరు..
రాయలసీమకు హింద్రీనీవా ప్రాజెక్టు అత్యంత కీలకమైనది. దానిని పూర్తి చేసి జాతికి అంకితం చేశారు చంద్రబాబు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలుగుతున్నారు. అసలు సాధ్యం కానీ వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసి కరువు నేలకు నీటి తడి ని అందించారు. మరోవైపు ఉత్తరాంధ్రకు పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా సాగునీరు విడుదల చేశారు. తద్వారా మిగతా ఉత్తరాంధ్రకు సైతం గోదావరి జలాలు వస్తాయని సంకేతాలు ఇచ్చారు. అసలు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబుపై విష ప్రచారం ఉండేది. కానీ వాటన్నింటినీ పూర్తిచేసి తనను తాను ప్రూవ్ చేసుకుని జాతికి అంకితం చేయగలిగారు.
గత ప్రభుత్వ వైఫల్యాలను అధిగమిస్తూ..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం చేశారన్న విమర్శ ఉంది. కానీ కూటమి వచ్చాక అదే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న సంకల్పం బలంగా కనిపించింది. గత రెండేళ్ల కాలంలో పెండింగ్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఈ విషయంలో మాత్రం మంత్రి నిమ్మల రామానాయుడు అభినందనలు అందుకుంటున్నారు. శాఖా పరంగా ఆయన చూపిన చొరవతోనే ఈ ఫలితాలు వస్తున్నాయి. మొత్తానికి అయితే ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా ప్రారంభోత్సవాలు చేస్తుండడం.. ప్రజల్లో ఒక రకమైన సానుకూలత వ్యక్తం అవుతోంది.