Addanki Dayakar: కూటమిలో చీలిక వెనుక బీజేపీ( Bhartiya Janata Party) హస్తం ఉందా? టిడిపి తో పాటు జనసేన ను తన చెప్పు చేతల్లో తీసుకునే ప్రయత్నమా? ఏపీ విషయంలో కేంద్రం మైండ్ గేమ్ ప్రారంభించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో ఏపీలోని మిత్రపక్షాలు కేంద్రంలో మెజారిటీకి అవసరం అయ్యాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మద్దతు బిజెపికి అనివార్యంగా మారింది. అందుకే బిజెపి ఏపీకి ఎనలేని ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోంది. గత రెండుసార్లు ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. కానీ ఈసారి అవసరాల దృష్ట్యా ఏపీకి ప్రాధాన్యం ఇస్తోంది. అయితే ఇది మిగతా రాష్ట్రాల విషయంలో బిజెపికి ఇబ్బందికరంగా మారుతోంది. అందుకే ఏపీ రాజకీయాలను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని బిజెపి భావిస్తోంది. అందుకే ఇతర రాష్ట్రాల మాదిరిగా రాజకీయ శూన్యత తెప్పించాలని చూస్తోంది.
* మహారాష్ట్రలో భారీ స్కెచ్ మహారాష్ట్రలో( Maharashtra) బిజెపి ఆడిన గేమ్ అంతా ఇంతా కాదు. ఎన్సిపి తో పాటు శివసేన విషయంలో ఎలా మైండ్ గేమ్ ఆడిందో తెలియంది కాదు. ఇప్పుడు ఏపీలో సైతం పవన్ కళ్యాణ్ను అడ్డంగా పెట్టుకుని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతుంది. అయితే గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు మూడు పార్టీల మధ్య సమన్వయ లోపాన్ని తెలియజేస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా జనసేన కార్యకర్తలు సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. మంత్రి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టిడిపి నేతలు బాహటంగానే డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి అని ప్రచారం ఉధృతంగా సాగుతోంది.
* అద్దంకి దయాకర్ సంచలన కామెంట్స్
అయితే ఇతర రాష్ట్రాల్లో బిజెపి( Bhartiya Janata Party) ప్రాంతీయ పార్టీలపై ఎటువంటి కుట్ర పన్నిందో.. ఏపీ విషయంలో సైతం అదే రకం ప్రయత్నాలు ప్రారంభించిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో బిజెపి గేమ్స్ స్టార్ట్ చేసిందని అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి ఆధిపత్యం చెలాయించడమే లక్ష్యమన్నారు. రాజకీయ మిత్రుల ద్వారా లబ్ధి పొంది.. అదే రాజకీయ పార్టీని అంతమొందించాలని బిజెపి ఎత్తుగడగా చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో కయ్యం తన మనుగడకు కష్టమనే విషయం బిజెపికి తెలుసునని.. అందుకే జనసేనను అడ్డం పెట్టుకొని రాజకీయం నడుపుతోందని ఆరోపించారు దయాకర్. 2029లో అధికారంలో రావడం కోసం బిజెపి ఎంతకైనా తెగిస్తుందని వ్యాఖ్యానించారు.
* గత అనుభవాల దృష్ట్యా
అయితే బిజెపి ( BJP)కోసం రాజకీయ ప్రత్యర్థులు చెప్పడం కాదు కానీ.. వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు కూడా అనుమానాలకు తావిస్తోంది. మొన్నటికి మొన్న ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతా దళ్ కి షాక్ ఇచ్చింది బిజెపి. దశాబ్దాల స్నేహాన్ని మరిచి.. అదే బిజు జనత దళ్ ను మట్టి కరిపించింది. ఇప్పుడు కూడా ఏపీలో ఒక మిత్రుడిని నిలువరించే క్రమంలో.. మరో మిత్రుడిని కచ్చితంగా రెచ్చగొడుతోంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే చంద్రబాబు ఈ విషయంలో చాలా ముదురు. రాజకీయ దురంధరుడు కూడా. హనుమంతుడు ముందు కుప్పిగెంతులు తగవు. అందుకే అది సాధ్యమయ్యే పని కాకపోవచ్చు అని విశ్లేషణలు కూడా ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.