Chevireddy Bhaskar Reddy: మనదేశంలో హెల్త్ టూరిజం విపరీతంగా పెరిగిపోతుంది. అమెరికా నుంచి మొదలుపెడితే ఆఫ్రికా వరకు అనేక దేశాలకు చెందినవారు మన దేశానికి వస్తున్నారు. బెంగళూరు.. చెన్నై.. ముంబై..కోల్ కతా, పూణే, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో అత్యంత ఖరీదైన శస్త్ర చికిత్సలను తక్కువ ధరకే పొందుతున్నారు.
గ్లోబల్ వ్యాప్తంగా హెల్త్ టూరిజం విషయంలో ఇండియా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నది. ఒక రకంగా అమెరికా వల్ల కానిది.. ఇతర అభివృద్ధి చెందిన దేశాల వల్ల కానిది కూడా భారత్ చేసి చూపిస్తోంది. మనదేశంలో అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలు ఆస్పత్రులు నిర్వహిస్తున్నాయి. అత్యంత ఖరీదైన వైద్యాన్ని అత్యంత తక్కువ ధరకు చేస్తున్నాయి. భారతదేశానికి ఈ స్థాయి లభించిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైసిపి సీనియర్ నాయకుడు.. మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహరించిన తీరు మాత్రం సరికొత్తగా ఉంది.
అమెరికాలో ఒక వ్యాధికి సంబంధించి చికిత్స చేయించుకోవాలి అంటే విపరీతంగా ఖర్చు పెట్టాలి. పైగా అక్కడ నిబంధనలు కూడా అత్యంత కఠినంగా ఉంటాయి. ఈ క్రమంలో వైసిపి నాయకుడు భాస్కర్ రెడ్డి అమెరికాకు ప్రయాణమయ్యారు. ఆయన అమెరికా వెళ్తుండడం ఏపీ రాజకీయాలలో సరికొత్త చర్చకు కారణమవుతోంది. మనదేశంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆసుపత్రులు చాలా ఉన్నాయి. ప్రపంచ దేశాల నుంచి రోగులు ఇక్కడ చికిత్స తీసుకోవడానికి వస్తూ ఉంటారు. అటువంటిది భాస్కర్ రెడ్డి మాత్రం అమెరికాలోని చికిత్స తీసుకుంటానని పట్టు పడుతున్నారు. అమెరికాలో వైద్య చికిత్స అత్యంత ఖరీదైన వ్యవహారం. ఆయనప్పటికీ ఆయన పదే పదే అమెరికా వెళ్లాలి అనుకోవడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా అని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూపొందించిన మద్యం పాలసీ లో అక్రమాలు జరిగాయని అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో భాస్కర్ రెడ్డి విచారణ ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆయన బెయిల్ మీద బయటికి వచ్చారు. ఈ క్రమంలో ఆయన ఏసీబీ కోర్టును ఆశ్రయించి అమెరికా వెళ్లడానికి అనుమతులు తీసుకుంటున్నారు. మూడు లక్షల వరకు భద్రతాపరమైన డిపాజిట్లు.. బాండ్లు సమర్పించి.. జూలై నెల చివరిలో ఆయన అమెరికాకు వెళ్లి వచ్చారు. మళ్లీ ఇప్పుడు అదే కారణాలు చూపి అక్కడికి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనా కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులు దేశం దాటి వెళ్లిపోవడం వెనుక ఆరోగ్య పరీక్షలు మాత్రమే ఉంటాయా.. లేదా ఇతర వ్యూహాలు ఏమైనా ఉన్నాయా అనే కోణాలలో రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు..
అత్యవసరమైన సమయంలో.. ఆరోగ్య భీమా సమస్యలు వంటివి ఎదురైనప్పుడు ఎన్నారైలు మన దేశానికి వచ్చి చికిత్స చేయించుకుంటున్న ఉదాహరణలు ఇటీవల కాలంలో మనం అనేకం చూస్తున్నాం. అలాంటిది భాస్కర్ రెడ్డికి మనదేశంలో ఎటువంటి కార్పొరేట్ హాస్పిటల్ సేవలు నచ్చడం లేదా.. ఇక్కడ వైద్యులపై పెద్దగా నమ్మకం లేదా.. అనే విషయాలు ఆచారాన్ని కలిగిస్తున్నాయి.. ఒకవేళ భాస్కర్ రెడ్డికి తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉండి ఉంటే.. దానికి సంబంధించిన వివరాలను ఎందుకు బయటపెడుతున్నారు.. అనే ప్రశ్న వ్యక్తమవుతోంది..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి నేతలు అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భాస్కర్ రెడ్డి అమెరికా వెళ్తున్నది కేవలం వైద్యం కోణంలోనా.. విదేశాలలో ఏమైనా ఆస్తులు పోగేశారా.. వ్యాపార లావాదేవీలు ఏమైనా కొనసాగిస్తున్నారా.. అనే అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.