Central Cabinet Expansion: కేంద్ర మంత్రివర్గ విస్తరణ పై మళ్లీ వార్తలు ప్రారంభం అయ్యాయి. త్వరలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుపుతారన్న టాక్ బలంగా ప్రారంభం అయింది. మోదీ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ విస్తరణ అనేది అనివార్యంగా తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న బిజెపి సీనియర్లలో చాలామందిని రాష్ట్ర గవర్నర్లుగా పంపిస్తారని కూడా ప్రచారం నడుస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి యువతకు క్యాబినెట్లో చోటు ఎక్కువగా కల్పిస్తారని తెలుస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు నాలుగు మంత్రి పదవులు ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఏపీలో భాగస్వామ్య పార్టీలు రెండింటికి ఈసారి ఛాన్స్ ఉంటుందన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో ఉంది. ప్రధానంగా ఏపీలో టిడిపికి ఒకటి, జనసేనకు ఒక మంత్రి పదవి ఖాయమని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే జనసేన నుంచి ఎవరు? టిడిపి నుంచి ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
* ఇప్పటికే టిడిపికి రెండు..
తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే రెండు మంత్రి పదవులు ఉన్నాయి. శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. సహాయం మంత్రి హోదాలో గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఆ ఇద్దరితో పాటు మరో మంత్రి పదవి టిడిపికి రావడం ఖాయమని తెలుస్తోంది. ఉత్తరాంధ్రాకు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. కోస్తాంధ్రకు పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. అందుకే ఈసారి రాయలసీమకు ఆ చాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారని ప్రచారం సాగుతోంది. ప్రముఖంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. లేకుంటే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కి చాన్స్ దక్కిన ఆశ్చర్యపోనవసరం లేదన్న టాక్ నడుస్తోంది.
* జనసేన కు ఛాన్స్..
జనసేనకు సంబంధించి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఆ పార్టీకి మొత్తం ముగ్గురు ఎంపీలు ఉన్నారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరు ఆ పార్టీ తరపున ఎంపీలుగా గెలిచారు. కాకినాడ నుంచి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి బాలసౌరి ఉన్నారు. ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా లింగమనేని రమేష్ జనసేన తరఫున ఎన్నికయ్యారు. ఒకవేళ జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కితే వల్లభనేని బాలసౌరికి అవకాశం అని తెలుస్తోంది. సామాజిక వర్గ పరంగా కూడా ఆయన వైపే మొగ్గు చూపుతారని తెలుస్తోంది. ఎందుకంటే ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రుల్లో ఒకరు వెలమ,, మరొకరు కమ్మ, ఇంకొకరు క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు. అందుకే రాయలసీమ నుంచి రెడ్డిలకు అవకాశం కల్పిస్తే.. జనసేన నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన బాల సౌరికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. మరి ఆ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.