Bhogapuram Airport Inauguration: జనం.. ఎటు చూసినా జనం.. ఉదయం వేలాదిమంది.. మధ్యాహ్ననికి మరింత మంది.. మరి కొద్ది సేపటకు లక్షలమంది.. ఇలా పెరుగుతూ వచ్చారు జనాభా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో. అంచనా రెండు లక్షల మంది వస్తారని వేస్తే.. ఏకంగా మూడున్నర లక్షల మంది వచ్చారు. దీంతో ఏం చేయాలో తెలియలేదు. అయినా సరే అధికారులు సమన్వయం చేసుకున్నారు. ఏర్పాట్లు చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం, ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ విజయవంతం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరో 50 సంవత్సరాలకు తగ్గట్టు విమానాశ్రయాన్ని నిర్మించింది. భవిష్యత్తు తరాలు కూడా చెప్పుకునేలా వేడుకలా జరపాలని భావించింది. ఇప్పుడు అనుకున్న విధంగా సక్సెస్ కావడంతో కూటమి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
* విస్తృత ప్రచారంతో..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సంబంధించి చాలా రోజుల నుంచి సన్నాహాలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించారు. ప్రారంభోత్సవ వేడుకలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో 11 మంది మంత్రుల బృందం ముందస్తుగానే అక్కడకు చేరుకుంది. రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా అయితే వారం రోజుల ముందుగానే అక్కడకు చేరుకున్నారు. దీంతో ఒక పద్ధతి ప్రకారం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడంతో నిన్నటి కార్యక్రమం సక్సెస్ అయ్యింది.
* జన సమీకరణలో సక్సెస్..
అయితే జన సమీకరణ విషయంలో సైతం ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం పని చేసింది. ఉమ్మడి ఉత్తరాంధ్ర నుంచి భారీగా జనాలు తీసుకొచ్చేందుకు ప్రణాళిక జరిగింది. ముఖ్యంగా విజయనగరం నుంచి జనం బాగా తరలివచ్చారు. జనం తరలింపునకు సంబంధించి రవాణా శాఖ ఏకంగా 5000 బస్సులను ఏర్పాటు చేసింది. ఈ బస్సులను సమన్వయ పరిచేందుకు సిబ్బంది, అధికారులు ఒక పద్ధతి ప్రకారం పని చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకున్నారు. దీంతో జనాలు అనుకున్న స్థాయి కంటే పెరిగారు. పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడంతో ప్రజలు స్వచ్ఛందంగా హాజరయ్యేందుకు ముందుకు వచ్చారు. పోలీస్ శాఖ సైతం విస్తృత చర్యలు చేపట్టింది. దాదాపు 7వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. వాహనాలను క్రమబద్ధీకరించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎటు చూసినా జనం అన్నట్టు నిన్న భోగాపురంలో జనసంద్రం కనిపించింది. సోషల్ మీడియాలో సైతం ఈ జనాల దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram