AP Local Body Elections: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ చైర్మన్ లను, నగరపాలక సంస్థ మేయర్లను ప్రజలు నేరుగా ఎన్నుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఇకనుంచి మున్సిపల్ చైర్మన్ తో పాటు మేయర్లను ప్రజలే నేరుగా ఎన్నుకుంటారు. గతం మాదిరిగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు నుంచి ఒకరిని ఎన్నుకునే అవకాశం ఉండదు. ప్రతి పార్టీ నుంచి ఒకరే బరిలో దిగుతారు. అదే ఈ ప్రభుత్వానికి రెఫరెండం. ప్రతిపక్ష పనితీరుకు కూడా ప్రజలు ఆమోదించేందుకు అవకాశం. ముఖ్యంగా ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అరుదైన ఛాన్స్ కూడా. ఎందుకంటే కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అదే జరిగితే ఇది ప్రత్యక్ష ఎన్నిక కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది.
* చాలా సులువు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్క మేయర్ అభ్యర్థిని.. మున్సిపల్ అభ్యర్థిని రంగంలోకి దించితే చాలు.. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉంటే.. కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏకపక్షంగా విజయం సాధించే అవకాశం ఉంది. గతం మాదిరిగా కౌన్సిలర్ల నుంచి.. కార్పొరేటర్ల నుంచి ఒకరిని ఎన్నుకుంటే మాత్రం ప్రలోభాల పర్వం నడుస్తుంది. ఆర్థిక భారం తప్పదు. క్యాడర్ కూడా ముందుకు రాని పరిస్థితి. అదే బలమైన అభ్యర్థిని బరిలో దించి చూస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం ఏ పాటిదో ఇట్టే తెలిసిపోతుంది. అందుకే ఈ ప్రత్యక్ష ఎన్నిక అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశంగానే చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఆ పార్టీ పుంజుకోవచ్చు కూడా.
* ఏకగ్రీవాలు లేకుండా..
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల కు సంబంధించి ఏకగ్రీవాలు ఉండకూడదు అని పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా ఏకగ్రీవలు జరిగితే ఊరుకునే అవకాశం లేదని తేల్చి చెప్పారు. అటువంటి చోట నియోజకవర్గ ఇన్చార్జిలను మార్చేస్తానని కూడా హెచ్చరించారు. అయితే అరుదైన అవకాశం ప్రభుత్వం వైసీపీకి ఇచ్చింది. ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నిక అనేది ఒక సాహసం అని చెప్పవచ్చు. కానీ ఇటువంటి నిర్ణయానికి కూటమి వచ్చిందంటే పట్టణ ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంది అనేది బలంగా నమ్ముతోంది ప్రభుత్వం. ఒకవేళ ప్రజా వ్యతిరేకత విపరీతంగా ఉందని జగన్మోహన్ రెడ్డి బలంగా చెబుతున్న వేళ… ఈ ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తప్పకుండా ఇబ్బందులు తప్పవు. పుంజుకున్నామన్న దశ నుంచి.. ఉనికి చాటుకోవాలన్న దశకు ఆ పార్టీ పడిపోవడం ఖాయం. అదే సమయంలో అధికార పార్టీకి ప్రతికూల ఫలితం వస్తే మాత్రం కౌంట్ డౌన్ మొదలైనట్టే.