AP Super Fine Rice: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజల కోసం మరో నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరకే బ్రాండెడ్ బియ్యం అమ్మకాలను ప్రారంభించింది. విజయవాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ బియ్యం అమ్మకాలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లతోపాటు 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా.. సూపర్ ఫైన్ రైస్ బియ్యం, కందిపప్పు, పామ్ ఆయిల్ తక్కువ ధరకు అందించే ఏర్పాట్లు చేశారు. నిజంగా ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యమైన బియ్యాన్ని.. మార్కెట్ కంటే తక్కువకి అందించే ఏర్పాట్లు చేయడం శుభపరిణామం.
* ఆకాశన్నంటుతున్న బ్రాండెడ్ రైస్..
ప్రస్తుతం బ్రాండెడ్ బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్న బియ్యం ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. అందుకే ఏపీ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం సహకారంతో కార్యక్రమాన్ని ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ రూ.52 కు… అలాగే బిపిటి రా రైస్ కేజీ రూ. 50 లకు ప్రజలకు విక్రయిస్తున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం చొప్పున ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందిస్తున్నారు. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని రైతు బజార్లో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
* నాణ్యమైన బియ్యం పేరుతో దోపిడీ..
బయట మార్కెట్లో నాణ్యమైన బియ్యం పేరుతో భారీగా దోపిడీ జరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో బిపిటి సూపర్ ఫైన్ బియ్యం కిలో 65 రూపాయల పై మాటే. కానీ రైతు బజార్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో దానిని 52 రూపాయలకే అందిస్తున్నారు. భవిష్యత్తులో పామాయిల్, కందిపప్పు సైతం తక్కువ ధరకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకు తగ్గ సన్నాహాలు కూడా చేస్తోంది. ఇంకో వైపు మీ మార్టులను సైతం పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. ఇలా రేషన్ వ్యవస్థలో సమూల మార్పులకు నాంది పలుకుతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. అయితే ఎక్కడికక్కడే ఈ బియ్యం కోసం జనాలు బారులు తీరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 135 రైతు బజార్లలో బియ్యం కోసం వచ్చే వారి రద్దీ కనిపిస్తోంది.