AP Congress leader gets Rajya Sabha seat: ఏపీలో ( Andhra Pradesh) రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. జూన్లో నలుగురు రాజ్యసభ సభ్యులు ఏపీ నుంచి పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఆ నాలుగు పదవులు కూడా కూటమికి దక్కనున్నాయి. ఎందుకంటే ఏపీలో కూటమి ఏకపక్షంగా బలంగా ఉంది. అందుకే ఆ నాలుగు పదవులు కూటమి ఖాతాలో పడనున్నాయి. అయితే అనూహ్యంగా ఏపీకి చెందిన ఓ కాంగ్రెస్ నేతకు రాజ్యసభ పదవి దక్కనున్నట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆ నేత ప్రస్తుతం.. ఏఐసీసీలో చోటు దక్కించుకున్నారు. ఆయనకు రాజ్యసభ పదవి దక్కడం ఖాయమన్న టాక్ నడుస్తోంది. అయితే అది ఏపీ నుంచి కాదు. కర్ణాటక నుంచి ఆయన నామినేట్ కానున్నట్లు తెలుస్తోంది. ఆయనే నీలకంఠాపురం రఘువీరారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ మంత్రిగా వ్యవహరించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం ఏఐసీసీ మెంబర్ గా ఉన్న ఆయనకు ఈసారి రాజ్యసభ ఛాన్స్ తప్పదు అన్న టాక్ నడుస్తోంది.
కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం
ఉమ్మడి అనంతపురం( Ananthapuram district) జిల్లా మడకశిర నియోజకవర్గం నుంచి తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు రఘువీరారెడ్డి. 1985లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ఆయన స్వల్పకాలంలోనే ఎమ్మెల్యే అయ్యారు. 1989లో తొలిసారిగా మడకశిర నియోజకవర్గం నుంచి గెలిచారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పదవి చేపట్టారు. 1994 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. 1999లో రెండోసారి గెలిచారు. 2004లో గెలిచి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారు. 2009లో సైతం కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి గెలిచారు రఘువీరారెడ్డి. మూడోసారి మంత్రి పదవి చేపట్టారు. రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లలో కొనసాగుతూ వచ్చారు. రాష్ట్ర విభజనతో చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇతర పార్టీల్లో చేరిపోయారు. రఘువీరారెడ్డి మాత్రం ఆ పని చేయలేదు. పైగా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఏఐసీసీ మెంబర్గా కొనసాగుతున్నారు.
కర్ణాటక నుంచి ఎంపిక..
అనంతపురం జిల్లా బెంగళూరుకు దగ్గరగా ఉంటుంది. కర్ణాటక రాజకీయాల్లో అక్కడ నేతలు యాక్టివ్ గా ఉంటారు. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ ఇన్చార్జిగా కూడా కొన్ని నియోజకవర్గాలకు వ్యవహరించారు రఘువీరారెడ్డి. బెంగళూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పర్యటనలు చేసి ఎన్నికల ప్రచారం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు. అందుకే ఇప్పుడు కర్ణాటక నుంచి రాజ్యసభకు రఘువీరారెడ్డిని ప్రమోట్ చేస్తారని తెలుస్తోంది. ఆ రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ అవుతున్నాయి. అందులో మూడు పదవులు కాంగ్రెస్ కూటమికి దక్కడం ఖాయం. అందుకే రఘువీరా పేరును కర్ణాటక కాంగ్రెస్ పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తప్పకుండా ఆయన రాజ్యసభ పదవికి ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.