Ambati Rambabu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు బారిన పడ్డారు. దీంతో హుటాహుటిన హైదరాబాదులోని ఓ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆయనకు శస్త్ర చికిత్స చేసి స్టంట్ వేసినట్లు తెలుస్తోంది. అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారన్న వార్త వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నింపింది. అయితే ఆయనకు ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తయిందని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నట్లు తెలుస్తోంది. గుంటూరులో ఉండగా ఆయన అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ తరలించి వైద్యం అందించారు.
* దూకుడు నేత..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు కలిగిన నేతల్లో అంబటి రాంబాబు ఒకరు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన ప్రస్తుతం గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. పార్టీ కార్యక్రమాల్లో ఉండగానే ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఛాతి నొప్పి అని తెలియడంతో ప్రాథమిక వైద్యం అందించి.. ఉన్నత వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్లు సమాచారం. ఆపరేషన్ విజయవంతం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తో పాటు కీలక నేతలంతా ఫోన్లో పరామర్శించారు. మరోవైపు అంబటి రాంబాబు కోలుకోవాలని ఆయన అభిమానులు పూజలు కూడా జరిపారు.
* రెండుసార్లు మాత్రమే ఎన్నిక..
కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అంబటి రాంబాబు ఒక సాధారణ న్యాయవాది. కాంగ్రెస్ లీగల్ సెల్ విభాగంలో పనిచేశారు. 1989లో తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అటు తర్వాత మళ్లీ వైసీపీ తరఫున 2019 ఎన్నికల్లో మాత్రమే అంబటి రాంబాబు గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేశారు కానీ భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో అంబటి రాంబాబు పోటీ చేయరు అన్న ప్రచారం నడిచింది. ఆయనను పార్టీ కోసం వినియోగించుకుంటారన్న టాక్ కూడా నడిచింది. ప్రస్తుతం గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గుంటూరు జిల్లాలో కీలక నేతలంతా పార్టీకి గుడ్ బై చెప్పిన తరుణంలో.. అంబటి రాంబాబు చాలా దూకుడుగా ముందుకు వెళుతున్నారు. పార్టీ బలోపేతానికి గట్టిగానే కృషి చేస్తున్నారు. ఇంతలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలియడం ఆందోళన కలిగించింది పార్టీ శ్రేణులకు. కానీ ఆపరేషన్ విజయవంతమై ఆయన కోలుకున్నారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.