Punganur Violence: పుంగనూరులో విధ్వంసం సృష్టించారు.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారు. ఇక్కడితోనే ఆగిపోలేదు.. చివరికి జగన్ సొంత నియోజకవర్గంలో సైతం ఉద్రిక్తతలు సృష్టించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సిన వచ్చింది. ఇదీ స్థానిక ఎన్నికల సందర్భంగా వైసిపి సృష్టిస్తున్న అరాచకం. చివరికి తాడిపత్రిలో సైతం విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారు. పోలీసులు ముందు చూపుతో వ్యవహరించడంతో కాస్త అలజడి ఆగింది.
పులివెందుల.. పుంగనూరు.. తాడిపత్రి.. ఈ మూడు ప్రాంతాలు రాయలసీమలో అత్యంత కీలకం. ఇప్పుడు వైసిపి నేతల దృష్టి రాయచోటి మీద పడింది. రాయచోటిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో.. అలజడి కలిగించేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. అంతేకాదు రాయచోటిలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తులు.. రెండు తుపాకులు.. లైవ్ తూటాలను పోలీసులు గుర్తించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతానికి చెందిన మరో ఐదుగురు వ్యక్తులను కూడా పోలీసులు గుర్తించారు. ఈ తొమ్మిది మందిని వైసిపి నాయకుడు.. ఎమ్మిగనూరు మున్సిపల్ స్థానం కోసం పోటీ చేస్తున్న షేక్ మహమ్మద్ ఆలియాస్ జిన్నా షరీఫ్ రప్పించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన వెనుక అతనికి.. కుటుంబ సభ్యులకు.. డ్రైవర్ కు సంబంధం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. షరీఫ్ ఆదేశాల మేరకు.. అవసరమైతే వ్యక్తుల మీద కాల్పులు జరిపేందుకు కూడా ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తులు సిద్ధంగా ఉన్నట్టు అభియోగాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో శాంతి భద్రతకు.. ప్రశాంతతకు భంగం కలిగించడమే లక్ష్యంగా ఈ వ్యక్తులు కుట్ర పన్నారని అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో రాయచోటి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది నేపథ్యంలో ఆదర్శ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలులోకి తీసుకొచ్చామని పోలీసులు చెబుతున్నారు. లైసెన్స్ కలిగిన ఆయుధాలను.. ఇతర ఆయుధాలను తమ వద్ద డిపాజిట్ చేయాలని పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ డిపాజిట్ చేయని పక్షంలో.. తాము ఆయుధాలను కనుక గుర్తిస్తే ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. శాంతిభద్రతకు విఘాతం కలిగించే పనులు చేపట్టే ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తే వారు గెలుస్తారు. కూటమి నేతలు విజయం మీద ఆశాభావంతో ఉన్నారు. అందువల్లే ఉత్సాహంగా నామినేషన్ వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వైసిపి సర్వే నిర్వహించినప్పటికీ అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అందువల్లే చాలాచోట్ల అభ్యర్థులు పోటీ చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ ఫ్రస్టేషన్ మొత్తాన్ని వైసీపీ అధినాయకత్వం ఇలా ప్రదర్శిస్తోంది. తద్వారా ఎన్నికలు వాయిదా వేయాలని కుట్రకు పాల్పడుతోంది. కానీ కూటమి ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. పైగా పోలీసులను భారీగా మోహరించడం.. సాంకేతిక పరికరాలను ఉపయోగించడంతో వైసీపీ ఆగడాలు చెల్లుబాటు కావడం లేదు. అందువల్లే ఇతర రాష్ట్రాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దుర్మార్గాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ పోలీసులు ఆడిగడుగునా అడ్డుకట్ట వేస్తుండడంతో వైసిపి నేతలు చివరికి ఇలా దిగజారుతున్నారు.