Big TV: ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకున్న 22a భూముల వ్యవహారం మీద.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల మీద బిగ్ టీవీ సంచలన కథనాలను ప్రసారం చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ నియామకాల వ్యవహారంలో బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాల నేపథ్యంలో.. ఆ ఛానల్ లో పనిచేస్తున్న కీలకమైన వ్యక్తులు ఉద్యోగాలకు రాజీనామా చేశారు.
డీఎస్సీ వ్యవహారం మీద బిగ్ టీవీ నెగిటివ్ వార్తలు ప్రసారం చేసిన నేపథ్యంలో.. టిడిపి నేతలు ఆ ఛానల్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ చానల్ పెద్దలు వైసిపి నేతలకు అమ్ముడుపోయారని.. తాడేపల్లి ప్యాలస్ నుంచి బిగ్ టీవీకి ముడుపులు అందాయని.. అందువల్లే ఆ చానల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని టిడిపి నేతలు అంటున్నారు. డీఎస్సీ వ్యవహారంలో లేని అక్రమాలను తెరపైకి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని.. చివరికి అధికారులకు వివరణ ఇచ్చిన తర్వాత ఛానల్ పెద్దలకు జ్ఞానోదయం అయ్యిందని టిడిపి నేతలు చెబుతున్నారు.
ఈ వ్యవహారం ఇలా సాగుతుండగానే బిగ్ టీవీ అమ్మకానికి సంబంధించి చర్చ నడుస్తోంది. బిగ్ టీవీకి వైసిపి నేతల్లో కీలకమైన సజ్జల రామకృష్ణారెడ్డి 60 కోట్ల వరకు ఇచ్చారని.. అందువల్లే ఆ చానల్లో టిడిపికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం అవుతున్నాయని.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా టిడిపి హ్యాండిల్స్ లో బిగ్ టీవీకి వ్యతిరేకంగా పోస్టులు కనిపిస్తున్నాయి. కానీ నేటి కాలంలో ఒక ఛానల్ ఏర్పాటు చేయాలంటే భారీగా డబ్బు ఖర్చు పెట్టాలి. న్యూట్రల్ గా ఉండాలి అనుకుంటే.. కేవలం ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో ఛానల్ నడిపించాలి అంటే కొంచెం ఇబ్బంది పడక తప్పదు.
ఛానల్ ఏర్పాటుకు 20 కోట్లు.. కేబుల్ ఆపరేటర్లకు ఏడాదికి ఐదు కోట్లు.. వేతనాలకు కోటి.. ఇలా లెక్కలేసుకుంటే యాజమాన్యాలకు పెద్దగా మిగలదు. అందువల్లే నేటి కాలంలో న్యూస్ ఛానల్ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పైగా యూట్యూబ్ లోనే చాలామంది చానల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఎన్ని కోట్లు పెట్టి ఛానల్ ఎందుకు కొంటారు.. అనే ప్రశ్న వ్యక్తం అవుతుంది. కొద్దిరోజులపాటు బిగ్ టీవీ అమ్మకానికి సంబంధించి చర్చ నడుస్తుంది. ఆ తర్వాత మరో విషయం రాగానే బిగ్ టివి అంశం చప్పబడిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ చానల్ ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. చానల్ నిర్వహిస్తున్న వాళ్లు ఆర్థిక భారం వల్ల తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. వైసీపీకి సాక్షి ఉంది. సాక్షి టీవీ కూడా ఉంది. ఆర్థిక భారం వల్ల అందులోనే కొంతమంది ఉద్యోగులను పక్కన పెట్టారు. ఇలాంటప్పుడు వైసీపీ నేతలు బిగ్ టీవీని ఎలా కొంటారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.