Polavaram Project : కొందరికి అభిమానం ఒకవైపు ఉంటుంది. కానీ నేరుగా అభిమానం చూపలేరు. వేర్వేరు మార్గాల్లో అభిమానాన్ని పంచుతుంటారు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తోంది అదేనని ఎక్కువ మంది అభిప్రాయపడుతుంటారు. ఆయన మాటల్లో స్పష్టమైన ఒక భావజాలం కనిపిస్తుంది. అదే కూటమి ప్రభుత్వ వ్యతిరేక భావజాలం. చంద్రబాబు పట్ల వ్యతిరేక భావజాలం. జగన్మోహన్ రెడ్డి పట్ల అనుకూల భావజాలం. గత కొద్ది రోజులుగా విశ్లేషకుడిగా అవతారం ఎత్తిన ఉండవల్లి అరుణ్ కుమార్.. అవసరమైన సందర్భాల్లో బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై ఒక మాట చెప్పి వెళ్ళిపోతుంటారు. ఈసారి మీడియా ముందుకు వచ్చి పోలవరం ప్రాజెక్టు విషయంలో వ్యాఖ్యలు చేశారు. ఇందులో కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ ఇచ్చుకో దలుచుకోలేదు. తన ఆప్త మిత్రుడు రాజశేఖర్ రెడ్డి చలువేనంటూ చెప్పుకొచ్చారు. తద్వారా కూటమికి వ్యతిరేకంగా.. వైసీపీకి సానుకూలత వచ్చేలా వ్యాఖ్యలు చేసి వెళ్లిపోయారు.
* లాజిక్కులతో కామెంట్స్..
లాజిక్కులతో మాట్లాడుతుంటారు ఉండవల్లి అరుణ్ కుమార్. కానీ ఆ లాజిక్కులు కొంతవరకు మాత్రమే పనిచేస్తాయి. రామోజీరావు పై ఉన్న వ్యతిరేకతతో మార్గదర్శిపై అధర్మయుద్ధం చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన పెద్దమనిషిగా ముద్రపడిన ఇదే ఉండవల్లి.. అదే రాష్ట్ర విభజనకు కారణమైన కెసిఆర్ పిలుపుతో ప్రగతి భవన్ కు వెళ్లారు. ఆయనకు విలువైన సలహాలు ఇచ్చారు. అదే ఉండవల్లి రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తున్నారు. తన వాదనలు వినిపిస్తున్నారు.
* పరోక్ష సాయానికే పరిమితం..
జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇవ్వాలని భావిస్తుంటారు. అయితే అది నేరుగా పార్టీలోకి వెళ్లి ఇవ్వరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకోరు కాబట్టి. అందుకే అప్పుడప్పుడు మీడియా విశ్లేషణల పేరుతో కొన్ని రకాల వనరులు అందిస్తుంటారు. ఇప్పుడు కూడా పోలవరం విషయంలో అదే ఇచ్చారు. పోలవరం అంటేనే వైయస్ రాజశేఖర్ రెడ్డి అని.. ఎవరెన్ని తపస్సులు చేసినా ప్రజలు రాజశేఖర్ రెడ్డిని మాత్రమే గుర్తుంచుకుంటారు అంటూ కూటమి ప్రభుత్వంపై వచ్చిన సానుకూలతను తగ్గించే ప్రయత్నం చేశారు. అంతిమంగా వైసిపికి అనుకూల అస్త్రంగా మార్చేందుకు ప్రయత్నించారు. వైసీపీ హయాంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కు మందు సీసాలు గుర్తుకు రాలేదు. అక్రమ మద్యం గుర్తుకు రాలేదు. కల్తీ మద్యం గుర్తుకు రాలేదు. వైసీపీ హయాంలో చంద్రబాబు అరెస్టును తప్పుపట్టారు. అదే చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే కనీసం అటువైపు చూడలేదు. పెద్దిరెడ్డి కుమారుడు అరెస్ట్ అయితే కూటమి ప్రభుత్వ తీరును తప్పు పట్టిన ఉండవల్లి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి మరి పరామర్శించారు. ఒకప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ముందుకు వస్తే ఏం చెబుతారా అని ఆత్రుతగా చూసేవారు.. కానీ ఇప్పుడు మాత్రం అదే చెబుతారు కదా అని నిట్టూర్చేలా పరిస్థితి మారింది.