India Bangladesh Relations: ప్రభుత్వం బలహీనంగా ఉన్నప్పుడు, ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడు తప్పుల మీద తప్పులు జరగడం సహజం. బంగ్లాదేశ్‌లో ఇది మళ్లీ మళ్లీ కనిపిస్తోంది. 2026 ఫిబ్రవరిలో ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రి అయిన తారీక్ రహ్మాన్ ప్రభుత్వం మెజారిటీ ఉన్నా ఆత్మవిశ్వాసం లేకుండా కనిపిస్తోంది. అంతర్గత శక్తుల భయం, ముఖ్యంగా జమాతే ఇస్లామీ ప్రభావం, విదేశాంగ విధానంలో స్పష్టత లేకపోవడం భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తున్నాయి.
సంప్రదాయానికి విరద్ధంగా..
బంగ్లాదేశ్ ప్రధానులు అధికారంలోకి వచ్చాక సాధారణంగా మొదట భారత్‌ను సందర్శించేవారు. ఎందుకంటే 4,096 కిలోమీటర్ల సరిహద్దు, నదుల నీటి వనరులు, వాణిజ్య మార్గాలు, విద్యుత్ సరఫరా, వైద్య సేవలు ఇలా అన్నింటిలోనూ భారత్‌పై ఆధారపడి ఉంది. కానీ తారీక్ రహ్మాన్ మొదటి విదేశీ పర్యటనగా మలేషియా, తర్వాత చైనాను ఎంచుకున్నారు. జూన్ 2026లో బీజింగ్‌లో జీ జిన్‌పింగ్, ఇతర నాయకులతో సమావేశాలు జరిపి సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లారు. తీస్తా నది నిర్వహణ కోసం చైనా సహకారం కోరారు. ఈ నది సిక్కింలో పుట్టి బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది. భారత్‌తో గతంలో చర్చలు సాగినా పరిష్కారం కాలేదు. ఇప్పుడు చైనా సాంకేతిక, ఆర్థిక సహాయం అందించే దిశగా అంగీకారం కుదిరింది. ఇంకా యునాన్ నుంచి మయన్మార్ మీదుగా బంగ్లాదేశ్‌కు ఆర్థిక కారిడార్ ఆలోచన కూడా ముందుకు వచ్చింది. కానీ మయన్మార్‌లో అస్థిరత, సాయుధ సమూహాల నియంత్రణ ఉన్న ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం, భద్రత ఆచరణలో కష్టమే అని నిపుణులు అంటున్నారు.
లాల్మోనీర్‌హాట్ విమానాశ్రయం (పాత వైమానిక స్థావరం) ఆధునీకరణ గురించి కూడా చర్చలు ఉన్నాయి. ఇది సిలిగుడి కారిడార్‌కు సమీపంలో ఉండటం భారత రక్షణ దృష్ట్యా ఆందోళన కలిగిస్తోంది. జె–10సీఈ విమానాల కొనుగోలు చర్చలు కూడా ముందుకు సాగుతున్నట్లు నివేదికలు ఉన్నాయి.
భారత్ పర్యటనకు బ్రేక్..
ఆగస్టు 23 నుంచి 25 తేదీ వరకు తారీఖ్ రహ్మాన్ భారత్‌లో పర్యటించాలి. కానీ అది జరగలేదు. షేక్ హసీనా అప్పగించాలనిషరతు పెట్టాడు. ఆమె ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల వాతావరణం దెబ్బతిన్నట్లు ఢాకా వాదన. ఇలాంటి షరతులతో సంబంధాలు ముందుకు సాగవు. భౌగోళిక, ఆర్థిక వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్‌కు విద్యుత్, డీజిల్ సరఫరాలో భారత్ కీలకం. ప్రస్తుతం గ్యాస్, విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉంది. లోడ్ షెడ్డింగ్, దుకాణాలు సాయంత్రం మూసివేత, టెక్స్‌టైల్ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అదనపు డీజిల్ కోసం భారత్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. సరుకు రవాణా, వైద్య చికిత్సల కోసం కూడా భారత్ మీదుగానే అనేక మంది వస్తున్నారు. ఈ ఆధారపడికి వ్యతిరేకంగా ధోరణి ఉంటే ఆర్థిక నష్టం తప్పదు.
భారత్ ప్రతిచర్యలు షురూ..
బంగ్లాదేశ్ తీరుతో భారత్ ప్రతిచర్య మొదలు పెట్టింది. సిలిగుడి కారిడార్‌ను బలోపేతం చేస్తోంది. కిషన్‌గంజ్, చోప్రా, ధుబ్రి వంటి ప్రాంతాల్లో కొత్త సైనిక స్థావరాలు, త్రిభుజ రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది. ఇది సరిహద్దు భద్రత, చొరబాట్ల నియంత్రణకు సంబంధించినది. విద్యుత్ సరఫరాపై అదనపు సెస్ లాంటి చర్యలు, నీటి వనరులపై ప్రభావం కూడా సాధ్యమే. సంబంధాలు కుదురుకోకపోతే బంగ్లాదేశ్‌కు మరింత ఇబ్బంది కలుగుతుంది.
విదేశాంగ బలహీనత
ప్రభుత్వం జమాతే ఇస్లామీ వంటి శక్తుల భయంతో భారత్‌తో సన్నిహితంగా ఉండలేకపోతోంది. అవసరమైనప్పుడు ఆశ్రయించి, స్నేహానికి దూరంగా ఉండే విధానం స్థిరమైనది కాదు. రా చీఫ్ పర్యటన లీక్ కావడం వంటి సంఘటనలు విశ్వాసాన్ని మరింత తగ్గిస్తాయి.
నీరు, విద్యుత్, వాణిజ్యం, ఉపాధి భారత్‌తో ముడిపడి ఉన్నాయి. చైనా సహకారం ఆర్థికంగా ఉపయోగపడవచ్చు కానీ భౌగోళిక వాస్తవాలను విస్మరించి సంబంధాలు నిర్మించడం సాధ్యం కాదు. హేతుబద్ధమైన, పరస్పర ప్రయోజనాల ఆధారంగా విధానం రూపొందితేనే స్థిరత్వం వస్తుంది. లేకపోతే అంతర్గత సంక్షోభాలు, ఆర్థిక ఇబ్బందులు మరింత పెరుగుతాయి.