Parvathipuram Manyam: గిరిజన ప్రాంతాల్లో రహదారులను ఏర్పాటు చేశామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కొండ శిఖర గ్రామాలకు సైతం ఒక మార్గం చూపించామని ప్రకటనలు చేస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ అనారోగ్య, అత్యవసర సమయాల్లో గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా ఓ వ్యక్తి తన ఐదేళ్ల బాలుడిని భుజంపై ఎత్తుకొని.. చిన్న పార్టీ వాగులో అతి కష్టం మీద నడిచి వెళుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొండ శిఖర గ్రామాలకు రహదారి సదుపాయం లేకపోవడాన్ని తెలియజేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడ్ని వైద్యం అందించాలన్న తపన ఆ తండ్రిలో కనిపిస్తోంది. కానీ కనుచూపుమేరలో కనిపించని పట్టణం ఒకవైపు ఆవేదనకు గురి చేస్తుంటే.. కనీసం నడిచేందుకు వీలులేని రోడ్డు ఆయనకు భారంగా మారింది. చివరకు తన కుమారుడ్ని ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ దృశ్యం పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో వెలుగు చూసినట్లు తెలుస్తోంది.
* అతి కష్టం మీద కొండ దిగుతూ..
రబ్బ – వనజారా వంటి గ్రామాలకు కనీసం నడిచి వెళ్లేందుకు కూడా రోడ్డు లేదు. అక్కడ పదుల కుటుంబాలు నివాసము ఉంటున్నాయి. ఈ క్రమంలో ఐదేళ్ల బాలుడు యశ్వంత్ అనారోగ్యానికి గురయ్యాడు. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. నిరసించి పోవడంతో ఆ బాలుడు తండ్రి ఆందోళనతో ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేందుకు బయలుదేరాడు. కానీ రహదారి లేకపోవడంతో అడ్డు దారిలో కొండ దిగువునకు చేరుకోవాలని భావించాడు. రోడ్డు లేకపోగా వర్షాలు ధాటికి.. కాలిమార్గం కూడా పూర్తిగా జలమయంగా మారింది. దీంతో ఆ వ్యక్తి భుజంపై కుమారుడ్ని పెట్టి.. తడవకుండా అడ్డంగా గొడుగు పెట్టి అతి కష్టం మీద ఆ నీటిలో దాటుకుంటూ వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. కొండ దిగువనకు చేరుకొని వాహనంలో కోనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో యశ్వంత్ ను చేర్పించి వైద్య సేవలు అందించాడు తండ్రి.
* కూటమి వచ్చిన తర్వాత..
వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గిరి శిఖర గ్రామాలకు రవాణా సదుపాయం కలిగింది. పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తో పాటు అటవీ శాఖ చూస్తున్న పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. మన్యంలో వేలాది కిలోమీటర్ల రహదారులను తీర్చిదిద్దారు. కొండ శిఖర గ్రామాలకు సైతం రహదారి సదుపాయం కల్పించారు. అత్యవసర అనారోగ్య సమయాల్లో అంబులెన్స్ లు వెళ్లే విధంగా వాటిని తీర్చిదిద్దారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సాలూరు, మెంటాడ వంటి ప్రాంతాల్లో కొండ శిఖర గ్రామాలు వందలాదిగా ఉన్నాయి. వాటికి సైతం ఒక పరిష్కార మార్గం చూపాలని అక్కడి గిరిజనులు కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుంటే తమకు ఒక్క మార్గం దొరుకుతుందని వేడుకుంటున్నారు.
View this post on Instagram