Organic Dairy Business: అమెరికాలో ఉద్యోగం. వారంలో ఐదు రోజులు మాత్రమే పని. నెల తిరిగేసరికి బ్రహ్మాండమైన జీవితం. విలాసవంతమైన నివాసం.. అన్ని కాళ్ల దగ్గరికి వచ్చే సౌలభ్యం.. ఇవన్నీ కూడా అతడికి ఉన్నాయి. కానీ ఏదో లోటు.. అదే అతడిని ఆలోచింపజేసింది. చివరికి కీలకమైన నిర్ణయం తీసుకునే దిశగా చేసింది. అతడు తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పుడు బిజినెస్ సర్కిల్ లో సరికొత్త చర్చకు దారితీస్తోంది.
సేంద్రియ ఉత్పత్తులు వాడేవారికి అక్షయకల్ప సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనదేశంలో సేంద్రియ ఉత్పత్తులను అందించే సంస్థలలో అక్షయ కల్పకు ముందు వరసలో స్థానం ఉంటుంది. అక్షయ కల్ప సంస్థ 2010లో కర్ణాటకలోని తిప్పుతూరు ప్రధాన కేంద్రంగా ఏర్పాటయింది. దీనిని శశికుమార్.. జి ఎన్ ఎస్ రెడ్డి ప్రారంభించారు. రసాయనాలు లేకుండా.. యాంటీ బయోటిక్స్ లేకుండా.. ప్రిజర్వేటివ్స్ లేకుండా పాలను, పాల ఉత్పత్తులను ఈ సంస్థ అందిస్తుంది.రైతుల నుంచి నేరుగా పాలను సేకరించే ఈ సంస్థ ఎటువంటి కృత్రిమ పదార్థాలను జత చేయకుండానే నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేరవేరుస్తూ ఉంటుంది.
అక్షయ కల్ప సంస్థను ఏర్పాటు చేసిన వ్యవస్థాపకులలో శశి కుమార్ ఒకరు. ఈయన అమెరికాలో విప్రో సంస్థలో ఐటీ ఉద్యోగిగా పని చేశారు. అయితే అమెరికాలో లగ్జరీ లైఫ్ వదిలేసి.. కుటుంబ సభ్యులు విమర్శిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా ఆయన ఇండియాకు వచ్చేశారు. అక్షయకల్ప సంస్థను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో నష్టాలు ఎదురయ్యాయి. నాలుగుసార్లు కంపెనీ మూతపడే స్థితికి వచ్చింది. అయినప్పటికీ శశి కుమార్ ధైర్యాన్ని కోల్పోలేదు. పైగా ప్రతి ఓటమిలోనూ ఆయన గెలుపును వెతుక్కున్నారు. ప్రతి నష్టం నుంచి ఆయన పాఠాన్ని నేర్చుకున్నారు. ఫలితంగా అక్షయ్ కల్ప సంస్థను 600 కోట్ల టర్నోవర్ స్థాయికి ఆయన చేర్చగలిగారు. ప్రస్తుతం అక్షయకల్ప సంస్థలో 2800 కు పైగా రైతు కుటుంబాలు ఉన్నాయి. వీరికి ఉపాధి కల్పించడమే కాకుండా.. నెలకు లక్ష రూపాయలుగా స్థిరమైన ఆదాయాన్ని శశి కుమార్ అందిస్తున్నారు.
అక్షయ కల్ప సంస్థలో ఉన్న ఆవులకు ఎటువంటి కృత్రిమమైన హార్మోన్లు ఇవ్వరు. పాలు పితికే వ్యవహారాన్ని పూర్తిగా మిషన్ల ద్వారా చేస్తారు. ఆ తర్వాత పాలను నాలుగు డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లగా మార్చుతారు.. ఆర్గానిక్ ఆవుపాలు.. ఏ 2 ఆవు పాలు.. పెరుగు.. పన్నీర్.. వెన్న.. నెయ్యి.. చీజ్ వంటి పాల ఉత్పత్తులు.. సేంద్రియ విధానంలో పండించిన కూరగాయలు.. పండ్లను అక్షయ కల్ప సంస్థ విక్రయిస్తూ ఉంటుంది. అక్షయకల్ప ఆధ్వర్యంలో బెంగళూరు.. చెన్నై.. హైదరాబాద్.. మైసూరు.. తిప్పుతూరు.. తుమకూరు వంటి నగరాలలో తమ సొంత యాప్.. అక్షయకల్ప ద్వారా ఉదయాన్నే డోర్ డెలివరీ సర్వీస్ అందిస్తున్నారు. అమెరికాలో ఉద్యోగాన్ని వదులుకొని.. నాలుగుసార్లు కంపెనీ ఆర్థికంగా నష్టాలలో ఉన్నప్పటికీ.. ఏమాత్రం భయపడకుండా శశికుమార్ తన మీద తాను ప్రయోగాలు చేసుకున్నారు. చివరికి 600 కోట్ల టర్నోవర్ విలువైన కంపెనీని ఏర్పాటు చేసి.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.