Donald Trump Iran War: అగ్రరాజ్యం పశ్చిమాసియాలో యుద్ధం రాజేసి 25 రోజులు దాటింది. ఇరాన్ సుప్రీం లీడర్‌తోపాటు టాప్ కమాండర్లను, కీలక నేతలు, అధికారులను అమెరికా మట్టుపెట్టింది. అయినా ఇరాన్ అమెరికాకు తలొగ్గలేదు. ప్రతిదాడులతో అగ్రరాజ్యాన్ని ఆర్థికంగా దెబ్బకొడుతోంది. హర్మూజ్ మూసివేసి ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం సృష్టించంది. గల్ప్ దేశాలపై వైమానిక, డ్రోన్ దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో ఆయిల్ ధరలు పెరిగి స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నుంచి అమెరికాపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా ఇరాన్ విద్యుత్ సంస్థలపై దాడిని ఐదు రోజులు వాయిదా వేశారు. ఐదు రోజుల గడువు పూర్తవుతున్న నేపథ్యంలో ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై దాడులను మరో 10 రోజులు (ఏప్రిల్ 6, రాత్రి 8 గంటల వరకు) వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇది ప్రపంచ ఇంధన మార్కెట్లకు ఊరటనిచ్చింది.
ట్రంప్ నిర్ణయం వెనుక మతలబు..
ఇరాన్ ప్రభుత్వం స్వయంగా చేసిన అభ్యర్థనను మన్నిస్తూ ఈ గడువు పొడిగించినట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు. చర్చలు సానుకూలంగా, ఫలవంతంగా సాగుతున్నాయని, ఇరానీయన్లు సంభాషణల్లో నిపుణులని కొనియాడారు. ఫేక్ న్యూస్ నమ్మొద్దని, యుద్ధం వల్ల కలిగే ఇంధన సంక్షోభాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రెండు రోజులుగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య అంతర్గతంగా నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నట్లు ట్రంప్ తెలిపారు. ‘మేము శాంతిని కోరుకుంటున్నాం, కానీ అది శక్తివంతమైన శాంతి అయి ఉండాలి‘ అని పేర్కొన్నారు.
వరుసగా గడువు పొడిగింపు..
హర్మూజ్ తెరవాలని లేకపోతే ఎనర్జీ కేంద్రాలపై దాడులు చేస్తామని ట్రంప్ మొదట ఇరాన్‌కు 48 గంటల గడువు విధించారు. తర్వాత దానిని 5 రోజులకు పెంచారు. తాజాగా గడువును మరో 10 రోజులకు పొడిగించారు. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని డెడ్‌లైన్ విధించిన కొద్ది రోజుల్లోనే ఈ మార్పు రావడం గమనార్హం. ఈ 10 రోజుల విరామం ఇరాన్‌కు చివరి అవకాశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ గడువులోగా ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే, ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌ను అంతర్జాతీయ నౌకల కోసం పూర్తిగా తెరవకపోతే, ఇరాన్‌లోని అతిపెద్ద విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ గతంలోనే హెచ్చరించారు.
ఇరాన్ వైఖరిలో కనిపించని మార్పు..
అయితే, ఇరాన్ గతంలో చర్చలు జరగలేదని ఖండించడం, ట్రంప్ ప్రకటనలను మానసిక యుద్ధంగా పేర్కొంది. అమెరికా ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోతోందని, ట్రంప్ అనుకున్నప్పుడు ఈ విరామం ముగుస్తుందని ఇరాన్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ‘దాడులను అమెరికా ఆపుతున్నట్టు భావించలేం. అమెరికా, ఇరాన్ మధ్య భారీ ఒప్పందం ఉండబోదు. ఇక చాలు అని ట్రంప్ అనుకుకున్నప్పుడు ఇది ముగుస్తుంది. అమెరికా ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోతోంది‘ అని ఇరాన్‌లోని అమెరికా రాయబారి కార్యాలయం మాజీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
కొనసాగుతున్న అణు కార్యక్రమాలు..
పెంటగాన్ నిఘా నివేదిక ప్రకారం, అమెరికా ఇరాన్‌లోని అణు కేంద్రాలపై చేసిన వైమానిక దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపలేదని, కేవలం కొన్ని నెలలు ఆలస్యం చేశాయని తెలిసింది. ట్రంప్ ప్రకటనలకు విరుద్ధంగా, అణు కేంద్రాలు పూర్తిగా నాశనం కాలేదు, సుసంపన్న యురేనియం నిల్వలు సురక్షితంగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. దాడులకు ముందే ఇరాన్ రహస్యంగా యురేనియంను సురక్షిత ప్రాంతానికి తరలించి ఉండవచ్చని అంచనా వేసింది.
గల్ఫ్ దేశాల ఆర్థిక ముప్పు
ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రమాదంలోకి నెట్టాయి. చమురు ధరల హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. యుద్ధం వల్ల చమురు సరఫరాకు అంతరాయం కలిగితే, ప్రపంచ దేశాలు గల్ఫ్ ఇంధనంపై ఆధారపడటం తగ్గించి, పునరుత్పాదక ఇంధనాల వైపు వేగంగా మళ్లే అవకాశం ఉంది. ఇది గల్ఫ్ దేశాల దీర్ఘకాలిక ఆదాయానికి గొడ్డలిపెట్టుగా మారుతుంది.
ఐక్యరాజ్య సమితి గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆపాలని తీర్మానం చేసిన నేపథ్యంలో ట్రంప్ దాడులు వాయిదా వేస్తున్నారని తెలుస్తోంది. కానీ, ఇరువైపులా సైనిక సిద్ధతలు కొనసాగుతుండటంతో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గలేదు. పది రోజుల విరామం కేవలం తాత్కాలికమా లేక శాశ్వత కాల్పుల విరమణకు దారి తీస్తుందా అనేది అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది.