BJP IT Cell Chief: భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో తన కార్యనిర్వాహక బృందాన్ని పునర్నిర్మించింది. నితిన్ నబీన్ నేతృత్వంలో ఏర్పడిన కొత్త టీంలో అనుభవజ్ఞులైన నాయకులు మళ్లీ కీలక బాధ్యతలు చేపట్టారు. రాం మాధవ్, స్మృతి ఇరాని వంటి వ్యక్తులు చాలా కాలం తర్వాత పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడం మొదలుపెట్టారు. అయితే ఈ పునర్నిర్మాణంలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం ఐటీ సెల్ చీఫ్ మార్పు. సోషల్ మీడియా ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రోజుల్లో ఐటీ బీజేపీ ఐటీసెల్ అత్యంత కీలకంగా మారింది. పాత చీఫ్ 12 ఏళ్లుగా పార్టీని విజయవంతంగా నడిపించారు. కొత్త చీఫ్‌పైనా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
అమిత్ మాలవ్య నుంచి దీపక్ మహాస్కే వరకు..
2014 నుంచి దాదాపు 12 సంవత్సరాల పాటు బీజేపీ ఐటీ సెల్‌ను నడిపిన అమిత్ మాలవ్య స్థానంలో దీపక్ మహాస్కేను నియమించారు. మాలవ్య హయాంలో పార్టీ డిజిటల్ ప్రచారంలో గణనీయమైన పురోగతి సాధించింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ఇటీవలి ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన నేతృత్వం కీలకంగా నిలిచింది. అయితే మారుతున్న సామాజిక మాధ్యమ ధోరణులకు అనుగుణంగా కొత్త నాయకత్వం అవసరమని పార్టీ భావించినట్లు కనిపిస్తోంది.
ఎవరీఈ దీపక్ మహాస్కే..
దీపక్ మహాస్కే ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం, కెమిస్ట్రీ అధ్యాపకుడిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన సోషల్ మీడియా, డేటా విశ్లేషణలో నిపుణుడు. జిల్లా, మండల స్థాయి నుంచి ఎన్నికల ఫలితాలను విశ్లేషించి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేసే వ్యూహాల్లో ఆయన ప్రావీణ్యం సాధించారు. ఛత్తీస్‌గఢ్‌లోని అనేక నియోజకవర్గాల్లో ప్రత్యేక ఐటీ బృందాలతో క్యాంపెయిన్‌లు నడిపి పార్టీ అధికారం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. బేటీ బచావో బేటీ పడావో, ఆరోగ్య శిబిరాలు, గ్రామీణ గ్రంథాలయాలు, డిజిటల్ చెల్లింపుల వంటి పథకాల డేటాను విశ్లేషించి ఓటర్లను చేరుకునే అనుభవం ఆయనకు ఉంది. జాతీయ స్థాయిలో ఎలక్టోరల్ డేటా, ప్రభుత్వ పథకాల ప్రణాళికలో ఆయన నైపుణ్యం పార్టీకి ఉపయోగపడుతుందని అంచనా.
ఎన్నికల్లో సోషల్ మీడియా కీలక పాత్ర..
భారత ఎన్నికల్లో సోషల్ మీడియా పాత్ర కాలక్రమేణా మారుతూ వచ్చింది. 2014లో ఫేస్‌బుక్ ప్రధాన వేదికగా నిలిచింది. బీజేపీ యువతను ఆకర్షించి గెలుపు సాధించగా, ప్రతిపక్షాలు ఆ మాధ్యమాన్ని పట్టించుకోలేదు. 2019 నాటికి వాట్సాప్ కీలకంగా మారింది. పార్టీ అంతర్గత సమాచారం, ప్రజా సందేశాలు వేగంగా చేరవేయడంలో అది సహాయపడింది. 2024లో యూట్యూబ్ ప్రాధాన్యం పెరిగింది. వామపక్ష, మోదీ వ్యతిరేక ఛానెళ్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రచారంలో చురుకుగా పాల్గొనడంతో బీజేపీకి సవాళ్లు ఎదురయ్యాయి.
ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్..
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఇన్‌స్టాగ్రామ్ ప్రాబల్యాన్ని స్పష్టం చేశాయి. టీవీకే నాయకుడు విజయ్ ప్రచారం మొత్తం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నడిపి, అభిమాన గ్రూపుల సాయంతో ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు సాధించారు. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ, ఢిల్లీ జంతర్ మంతర్ ఉద్యమం, జార్ఖండ్ నిరసనలు కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విస్తృత ప్రచారం పొందాయి. యువతకు ఇన్‌స్టాగ్రామ్ ప్రధాన సమాచార మాధ్యమంగా మారింది. 2029 లోక్‌సభ ఎన్నికల్లో 25 నుంచి 30 శాతం మంది తొలిసారి ఓటు వేసే జెన్‌జీ వర్గం ఉంటుంది. వారిని చేరుకోవడంలో ఇన్‌స్ట్రాగామ్ కీలక పాత్ర పోషించనుంది.
కొత్త నాయకత్వం ముందు కీలక లక్ష్యాలు
2027లో కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ భావిస్తోంది. యువ ఓటర్లను ఆకర్షించి, పార్టీ వైపు మళ్లించడమే ప్రధాన లక్ష్యం. దీపక్ మహాస్కే నాయకత్వంలో ఐటీ సెల్ ఇన్‌స్టాగ్రమ్ కేంద్రంగా వ్యూహాలు రచించి, డేటా ఆధారిత ప్రచారం చేపట్టే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా చేరవేయడం, స్థానిక స్థాయి డేటా విశ్లేషణ ద్వారా లక్ష్య ఓటర్లను గుర్తించడం వంటి అంశాలపై దృష్టి పెట్టవచ్చు.
అమిత్ మాలవ్య 12 ఏళ్ల కృషి పార్టీకి బలమైన పునాది వేసింది. ఇప్పుడు మారుతున్న డిజిటల్ వాతావరణంలో కొత్త నాయకత్వం ఆ పునాదిని మరింత బలోపేతం చేయాల్సి ఉంది. ఇన్‌స్టాగ్రామ్, యువత, డేటా ఈ మూడు అంశాలపై దృష్టి సారించి బీజేపీ 2029కు సన్నాహం చేస్తుందని చెప్పవచ్చు. ఈ మార్పు కేవలం వ్యక్తి మార్పు కాదు, సోషల్ మీడియా ఎన్నికల్లో కొత్త అధ్యాయంగా చెప్పవచ్చు.