Homeఅంతర్జాతీయంMecca Agreement: మక్కా ఒప్పందం.. సంతకాలు తడి ఆరకముందే పరీక్ష..

Mecca Agreement: మక్కా ఒప్పందం.. సంతకాలు తడి ఆరకముందే పరీక్ష..

Mecca Agreement: ఒప్పందాలు చేసుకోవడం ఒకటి, వాటిని ఆచరించడం మరొకటి. అంతర్జాతీయ రాజకీయాల్లో ఈ తేడా తరచుగా కనిపిస్తుంది. పాకిస్తాన్‌ ఒప్పందాలు చేసుకోవడం తప్ప పాటించదు. శత్రు దేశాల ఒప్పందాలనే కాదు మిత్ర దేశాల ఒప్పందాలనూ లెక్క చేయదు. ఇటీవల మక్కాలో సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్తాన్‌ మధ్య సంతకాలు చేసిన సంయుక్త రక్షణ ఒప్పందం ఈ వాస్తవాన్ని మళ్లీ గుర్తు చేస్తోంది. ఒకరిపై దాడి జరిగితే ముగ్గురిపై దాడిగా భావించాలని ప్రకటించిన ఈ కూటమి, సంతకాలు […]

Mecca Agreement: ఒప్పందాలు చేసుకోవడం ఒకటి, వాటిని ఆచరించడం మరొకటి. అంతర్జాతీయ రాజకీయాల్లో ఈ తేడా తరచుగా కనిపిస్తుంది. పాకిస్తాన్‌ ఒప్పందాలు చేసుకోవడం తప్ప పాటించదు. శత్రు దేశాల ఒప్పందాలనే కాదు మిత్ర దేశాల ఒప్పందాలనూ లెక్క చేయదు. ఇటీవల మక్కాలో సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్తాన్‌ మధ్య సంతకాలు చేసిన సంయుక్త రక్షణ ఒప్పందం ఈ వాస్తవాన్ని మళ్లీ గుర్తు చేస్తోంది. ఒకరిపై దాడి జరిగితే ముగ్గురిపై దాడిగా భావించాలని ప్రకటించిన ఈ కూటమి, సంతకాలు అయిన కొన్ని గంటలకే హూతీ దాడులతో పరీక్షకు గురైంది. ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాల స్పందన లేకపోవడం ఒప్పందం అమలునే ప్రశ్నార్థకం చేసింది.

మక్కా ఒప్పందం ఏమిటి?
2026 ఆగస్టు 7న మక్కాలో సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్, తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్దోగాన్, పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ప్రధాన నిబంధన ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా అది మూడు దేశాలపై జరిగినట్లు పరిగణించి సమష్టి రక్షణకు సిద్ధం కావాలి. సౌదీ ఆర్థిక బలం, తుర్కియే నాటో సభ్యత్వం, రక్షణ పరిశ్రమ, పాకిస్తాన్‌ అణు సామర్థ్యం ఈ మూడు కలిసి మంచి సామర్థ్యం ఉన్న కూటమిగా కనిపిస్తుంది. ప్రాంతీయ అస్థిరత, ఇరాన్‌ సంబంధిత ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది సమష్టి నిరోధక శక్తిని పెంచుతుందని ప్రకటనలు వచ్చాయి.

హూతీ దాడులు..
ఒప్పందం సంతకాలు అయిన వెంటనే యెమెన్‌లోని హూతీలు సౌదీ అరేబియా లక్ష్యాలపై దాడులు చేశారు. జుబైల్, జజాన్‌ ప్రాంతాల్లోని అరామ్కో రిఫైనరీలు లక్ష్యంగా ఉన్నాయి. జజాన్‌ రిఫైనరీ రోజుకు లక్షల బ్యారెళ్ల చమురు ప్రాసెస్‌ చేసే ముఖ్య సదుపాయం. హూతీలు ఈ దాడులకు బాధ్యత వహించి వీడియోలు కూడా విడుదల చేశారు. సౌదీ అధికారులు దాడులను ధ్రువీకరించారు. ఇంతకుముందు కూడా బెరీ గ్యాస్‌ ప్లాంట్, ఇతర లక్ష్యాలపై దాడులు జరిగిన నేపథ్యం ఉంది. ఒప్పందం ప్రకారం ఇవి సౌదీపై దాడులు కాబట్టి ముగ్గురి సమస్యగా మారాల్సి ఉంది. అయినా పాకిస్తాన్‌ లేదా తుర్కియే నుంచి సైన్యం పంపడం, లేదా బలమైన ఖండన కనిపించలేదు. ఇది ఒప్పందం కేవలం ప్రకటన స్థాయిలోనే ఉందన్న అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది.

ఏడు నిమిషాల పాట పాకిస్తాన్‌..
పాకిస్తాన్‌ ఒప్పందాలు చేసుకోవడంలో చురుకుగా ఉంటుంది. కానీ వాటిని పాటించడంలో మాత్రం తరచుగా విమర్శలకు గురవుతుంది. చైనాతో సన్నిహితంగా ఉండి కూడా అమెరికాతో సంబంధాలు కొనసాగించడం, సరిహద్దు దేశాలతో వైరం కొనసాగించడం వంటివి దాని విదేశాంగ విధానంలో సాధారణం. సౌదీతో గతంలో కూడా రక్షణ సహకారం ఉన్నప్పటికీ, తాజా దాడుల్లో ప్రత్యక్ష సైనిక సహాయం పంపకపోగా, పాకిస్తాన్‌ సైన్యం తయారు చేసిన ఏడు నిమిషాల పాటను సౌదీ అరేబియాకు పంపింది.

అలైన్‌మెంట్‌ తేడాలు
ఈ మూడు దేశాల మధ్య సహజ అలైన్‌మెంట్‌ పూర్తిగా ఒకేలా లేదు. తుర్కియే అజర్‌బైజాన్‌ పక్షం వహించగా, ఇతర ప్రాంతీయ వివాదాల్లో వేర్వేరు స్థానాలు ఉన్నాయి. సౌదీ–పాకిస్తాన్‌ మధ్య చారిత్రక సైనిక సహకారం ఉన్నప్పటికీ, వ్యూహాత్మక ప్రాధాన్యాలు ఎల్లప్పుడూ సమానం కావు. పాకిస్తాన్‌ చైనా సంబంధాలు, అమెరికాతో సంబంధాలు, ఆఫ్ఘనిస్తాన్‌–భారత్‌ సరిహద్దు సమస్యలు దాని నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఇలాంటి వైవిధ్యాల మధ్య నిజమైన సమష్టి రక్షణ ఎలా పని చేస్తుందన్నది ప్రశ్న.

మక్కా ఒప్పందం ప్రాంతీయ భద్రతా వ్యవస్థలో కొత్త అధ్యాయం అని చెప్పవచ్చు. కానీ ఒప్పందాల బలం సంతకాల్లో కాదు, ఆచరణలో ఉంటుంది. హూతీ దాడులపై తక్షణ, స్పష్టమైన స్పందన లేకపోవడం దీన్ని గాలి బుడగలా చూపిస్తోంది. పాకిస్తాన్‌ ఒప్పందాలను పాటించడంలో గత రికార్డు, ప్రస్తుత వైఖరి కలిపి చూస్తే, ఈ కూటమి ఎంతకాలం, ఎలా నడుస్తుందో కాలం చెబుతుంది. సౌదీ అరేబియా భద్రతా అవసరాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఒప్పందం నిజమైన రక్షణ కవచంగా మారుతుందా, లేక ప్రకటన స్థాయిలోనే ఉండిపోతుందా అన్నది కీలకం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper