Homeఅంతర్జాతీయంAmerica Iran war latest updates: అమెరికా–ఇరాన్‌ వార్‌... ఒకవైపు శాంతి మంత్రం.. మరోవైపు యుద్ధ...

America Iran war latest updates: అమెరికా–ఇరాన్‌ వార్‌… ఒకవైపు శాంతి మంత్రం.. మరోవైపు యుద్ధ తంత్రం..!

America Iran war latest updates: పశ్చిమాసియాలో త్వరలోనే శాంతి నెలకొంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచానికి శుభవార్త చెప్పారు. ఇరాన్‌ కూడా యురేనియం వదులుకునేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో ఇక అంతా మంచే జరుగుతుందని భావిస్తున్న వేళ అమెరికా ఆత్మరక్షణ పేరుతో ఇరాన్‌పై భీకర దాడులు మొదలు పెట్టింది. మరోమారు తన సైనిక బలాన్ని ప్రదర్శించింది. ఇరాన్‌ దక్షిణ తీర ప్రాంతాల్లోని బందర్‌ అబ్బాస్, క్వెష్మ్‌ పోర్టు సమీపంలోని సైనిక స్థావరాలు, క్షిపణి లాంచ్‌ ప్యాడ్లు, సముద్రంలో మైన్లు (మందుపాతరలు) పరచే బోట్లు, నేవీ బేస్‌లపై తీవ్ర దాడులు జరిపింది. అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రతినిధి కెప్టెన్‌ టిమోతీ హాకిన్స్‌ ఈ దాడులను ‘‘ఆత్మరక్షణ చర్య’’గా సమర్థించారు. ఇరాన్‌ తీరం వెంట ఉన్న క్షిపణి స్థావరాలు తమ విమాన వాహక నౌకలు, యుద్ధ నౌకలకు నేరుగా ముప్పు కలిగించాయని, మందుపాతరలు పరచడానికి ప్రయత్నించే బోట్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. లర్క్‌ ద్వీపంలో కనీసం నలుగురు మరణించినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌ కూడా పాల్గొన్నట్లు కొన్ని వార్తా వర్గాలు పేర్కొన్నాయి.

సీజ్‌ఫైర్‌ ఉల్లంఘన..
ఏప్రిల్‌ 7న ప్రకటించిన సీజ్‌ఫైర్‌ అమలులో ఉన్నప్పటికీ ఇరాన్‌ తన సైనిక సామర్థ్యాన్ని వేగంగా పునరుద్ధరిస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్‌ గుర్తించింది. ఇది ఇరాన్‌కు స్పష్టమైన హెచ్చరిక. దోహాలో జరుగుతున్న కీలక దౌత్య ప్రయత్నాలుదాడులు జరుగుతున్న అదే సమయంలో ఖతార్‌ రాజధాని దోహాలో ఇరాన్‌–అమెరికా దూతల మధ్య కీలక చర్చలు సాగుతున్నాయి. ఇరాన్‌ పార్లమెంటు స్పీకర్‌ మహమ్మద్‌ బాఘర్‌ ఘాలిబఫ్‌ నేతృత్వంలోని బృందం ఈ సంప్రదింపుల్లో పాల్గొంటోంది. ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘాయీ మాట్లాడుతూ అనేక అంశాలపై అవగాహన కుదిరినట్లు, అయితే ఇంకా కొన్ని కీలక సమస్యలు మిగిలి ఉన్నాయని తెలిపారు.ఇరాన్‌ ప్రధాన దృష్టి యుద్ధ ముగింపు (లెబనాన్‌తో సహా) వైపే ఉందని, ప్రస్తుతం అణు అంశాలను చర్చించడం లేదని స్పష్టం చేశారు.

యుద్ధం పూర్తిగా ముగిస్తే..
యుద్ధం పూర్తిగా ముగిస్తే 60 రోజుల వ్యవధిలో అణు సంబంధిత చర్చలు ప్రారంభించవచ్చని సంకేతాలిచ్చారు. ఖతార్‌ మధ్యవర్తిత్వం ఈ చర్చలకు కీలకమవుతోంది. లెబనాన్‌పైనా దాడులు జరగకుండా ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది.

మిసైల్‌ దాడులు..
ఈ తరుణంలో అమెరికా 33 మిసైల్‌ సైట్లలో దాదాపు 30ను తిరిగి కార్యకలాపాలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 70 శాతం మొబైల్‌ మిసైల్‌ లాంచర్లను మోహరించింది. ఇది ఇరాన్‌ ఎదురుదాడి సామర్థ్యాన్ని ఇప్పటికీ కాపాడుకోవాలన్న సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది. మరోవైపు అమెరికా దాడులు ఇరాన్‌ను మరింత ఒత్తిడికి గురి చేసి చర్చల టేబుల్‌ వద్ద రాజీకి సిద్ధం చేయడానికి ఉద్దేశించినట్లు కనిపిస్తోంది. ఈ ద్వంద్వ వ్యూహం (దాడి + దౌత్యం) మధ్యప్రాచ్య రాజకీయాల సారాంశాన్ని బయటపెడుతోంది. స్ట్రెయిట్‌ ఆఫ్‌ హార్ముజ్‌ భద్రత, ఇరాన్‌ అణు కార్యక్రమ నియంత్రణ, ప్రాంతీయ స్థిరత్వం – ఇవన్నీ అమెరికా స్ట్రాటజిక్‌ లక్ష్యాలు. ఇరాన్‌ మాత్రం ఆర్థిక ఒత్తిడి, సైనిక నష్టాల నుంచి బయటపడి తన ప్రాంతీయ ప్రభావాన్ని కాపాడుకోవాలని చూస్తోంది.

ఇరాన్‌ ఎలా స్పందిస్తుంది?
ఈ చర్చలు విజయవంతమైతే మధ్యప్రాచ్యంలో కొత్త శాంతి అధ్యాయం మొదలవుతుంది. ఇరాన్‌ ఆయిల్‌ ఎగుమతులు సాఫీగా జరగడం, ఆర్థిక ఉక్కిరిబిక్కిరి తగ్గడం, ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గడం వంటి సానుకూల ఫలితాలు వస్తాయి. కానీ ఒప్పందం కుదరకపోతే ఉద్రిక్తతలు మరింత పెరిగి పెద్ద యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం రెండు వైపులా ‘‘ఒప్పందం కావాలి’’ అన్న కోరిక కనిపిస్తోంది. అయితే షరతులు, అణు అంశాలు, సైనిక నియంత్రణ వంటి విషయాల్లో ఇంకా తీవ్ర అసమ్మతి నెలకొని ఉంది.

దోహా చర్చల ఫలితాలు రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. మధ్యప్రాచ్య శాంతి ఎప్పుడూ సులభం కాదు. బాంబులు పడుతున్నప్పుడే దౌత్యం నడుస్తున్న ఈ ఆటలో ఏ చిన్న తప్పిదం కూడా సమస్యగా మారుతుంది. ఈ సంక్లిష్టతల మధ్య నుంచి నిజమైన శాంతి ఎలా ఉద్భవిస్తుందో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular