Guntur Love Marriage: వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. మన నాశనానికి మన బుద్ధి పెడదారులు పడుతుందట. ఇటీవల కాలంలో ప్రతి విషయానికి పెద్దలను ఎదిరించడం పరిపాటి అయింది. దీంతో అన్ని విషయాల్లో కూడా అలాగే చేస్తున్నారు. తమకు ఇష్టమైన చదువు చదువుతామని, తమకు కావాల్సిన వారినే పెళ్లి చేసుకుంటామని ఇలా చెబుతూ పెద్దలను బాధపెడుతున్నారు. తద్వారా వారు బాధపడుతున్నారు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫేస్ బుక్ లు, ట్విటర్ లు, ఇన్ స్టాగ్రామ్ ల ప్రేమలు ఎంతో కాలం నిలవలేవు. జీవిత భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకోకుండా మెచ్చి వచ్చిన వారిని నట్టేట ముంచుతున్నారు. అదనపు కట్నం పేరుతో వేధించి చివరకు ప్రాణం తీసుకునేలా చేసిన ఓ విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన శాల సమంత పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని వేల్పూరు సాలిపేటకు చెందిన నవీన్ ను ఫేస్ బుక్ పరిచయం ద్వారా ప్రేమించింది. సామాజిక మాధ్యమాల్లోనే వారి ఊసులు కలిశాయి. బాసలు చేసుకున్నారు. ఇద్దరు ఒక్కటిగా కావాలని కలలు కన్నారు. ఇంకేముంది నవీన్ చెప్పిన మాటలకు పొంగిపోయిన తల్లిని కాదని ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది. ఇద్దరు తిరుమలలో వివాహం చేసుకున్నారు. అనంతరం తణుకు పోలీస్ స్టేషన్ లో పోలీసుల రక్షణ కోరారు.
Also Read: Samantha- Naga Chaitanya: సమంత ఏం చెప్పింది? నాగచైతన్య మౌనం వెనుక కథేంటి? అమలలా సమంత ఎందుకు ఒదగలేదు?
దీంతో వారు ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇద్దరు మేజర్లు కావడంతో ఇరు కుటుంబాలు వారి ప్రేమను అంగీకరించాలని సూచించారు. దీంతో ఇక చేసేది లేక రెండు కుటుంబాలు ఒప్పుకోవడంతో వారి ప్రేమ, పెళ్లి సుఖాంతం అయింది. ఇక వారు కొత్త కాపురం మొదలుపెట్టారు. వారి సంసారం సజావుగానే సాగుతోంది. రెండు నెలలు గడిచాక నవీన్ లో రాక్షసుడు మేల్కొన్నాడు. అదనపు కట్నం కావాలని వేధింపులు మొదలు పెట్టాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కట్నం ఎలా ఇస్తారని ప్రశ్నించడంతో కొట్టడం మొదలుపెట్టాడు.

ఇటీవల ఆషాఢమాసం కావడంతో పుట్టింటికి వచ్చిన సమంత తనను వేధిస్తున్నాడని వాపోయింది. తను కాపురం చేయలేనని ఏడ్చింది. అన్ని సర్దుకుంటాయని తల్లి నచ్చజెప్పి కాపురానికి పంపింది. కానీ ఏమైందో తెలియదు సమంత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మూడు రోజుల క్రితమే తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు సందేశం పంపినా ఎందుకు పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తమ కూతురును అదనపు కట్నం కోసం వేధించి అల్లుడే ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని తల్లి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నవీన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రేమించిన పాపానికి సమంతను బలి తీసుకున్న నవీన్ ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read:Shamshera: స్టార్ హీరో సినిమాకి జనం లేక షోలు రద్దు.. ఇది ఇండస్ట్రీకే షాకింగ్ !