
Nara Lokesh Trold: శుభం కోరుకోరా పెళ్ళికొడుకా అంటే…మా అత్త నల్ల కుండల కాన్నే ముండమోయాలి” అన్నాడట వెనుకటికి ఒకడు.. అలానే ఉంది తెలుగుదేశం పార్టీ యువకిశోరం నారా లోకేష్ బాబు వ్యవహారం. కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అతడు “యువగళం” అనే పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ యాత్ర చిత్తూరులో ముగిసింది. అనంతపురంలో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా లోకేష్ బాబు జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏర్పాటుచేసిన వివిధ అభివృద్ధి పనుల వద్ద సెల్ఫీ తీసుకొని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి సవాల్ విసురు తున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అక్కడక్కడ లోకేష్ మాట్లాడుతున్న మాటలే నవ్వు తెప్పిస్తున్నాయి.
ఇటీవల అనంతపురం జిల్లాలో జరిగిన ఓ సమావేశంలో లోకేష్ బాబు మాట్లాడాడు. తనకు వచ్చిన తెలుగులోనే జగన్ మీద విమర్శలు చేశాడు. పాపం ఎండకు తిరుగుతున్నాడు కాబట్టి నోరంతా బొంగురు పోయింది. మాట కూడా స్పష్టంగా పలకడం లేదు. పైగా లోకేష్ బాబుకు నాలుక తిరగదు కాబట్టి మాట మాట్లాడితే వేరే అర్థం ధ్వనిస్తుంది. ఇక ఆ సమావేశానికి భారీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. వారిని ఉద్దేశించుకుంటూ మాట్లాడిన లోకేష్..” తమ్ముళ్ళూ మీ స్పీడ్ చూస్తుంటే సైకిల్ హెలికాప్టర్ వేగంతో వెళ్తున్నట్టు అనిపిస్తోంది.. 2019 మళ్ళీ రిపీట్ అవుద్దేమో అనిపిస్తోందని” వ్యాఖ్యానించాడు.. దీంతో అక్కడ ఉన్న తెలుగు తమ్ముళ్ళకు మతి పోయినంత పని అయింది.

ఎందుకంటే 2019లో తెలుగుదేశం పార్టీ జగన్ దెబ్బకు 23 స్థానాలకు పరిమితం కావలసి వచ్చింది. చాలామంది మంత్రులు డిపాజిట్ కోల్పోయారు. కొన్ని జిల్లాల్లో అయితే తెలుగుదేశం పార్టీకి ఒక్క సీట్ కూడా రాలేదు. చివరికి లోకేష్ తన మంగళగిరి స్థానాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే అతిపెద్ద ఓటమిని 2019 ఎన్నికల్లో చవిచూసింది.. ఇప్పటికీ ఆ సంవత్సరం పేరు చెప్తే చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి తీవ్ర ఓటమిని మిగిల్చిన 2019 ని లోకేష్ పదేపదే గుర్తు చేస్తున్నాడు అంటే.. ఈసారి కూడా అధికారంలోకి రాదు అని సంకేతాలు ఇస్తున్నాడా అని టిడిపి కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మొన్ననే కదా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను గెలిచి తెలుగుదేశం పార్టీ జోష్ లో ఉంది. మరోవైపు అధికార వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యేలు జగన్ కు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. ఇలాంటప్పుడు ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు చేసి, 2024 ఎన్నికలకు మంచి పునాది వేసుకోవాల్సింది పోయి.. కార్యకర్తలు ఉత్సాహం నీరుగారే విధంగా మాట్లాడుతున్న తీరు వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. ఏంటో ఈ లోకేష్ తెలుగు ఎప్పుడు మారుతుందో? ఆయన భాష ఎప్పటికి అర్థం అవుతుందో?! పాపం ఆ బ్లడ్ బ్రీడ్ భాష ఇలాగే ఉంటుందేమో?