Times Now Editor Rahul Sivashankar: మొన్నటిదాకా ఎన్డీటీవీ కాంగ్రెస్ అనుకూల మాటలు మాట్లాడేది. దాని యాజమాన్యం కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మేళ్ళు పొందడంతో దానికి అనుకూలంగానే రిపోర్టింగ్ చేసేది. 2014లో అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీ తిరోగమనం మొదలయింది. ఎన్డిటీవీ పతనం కూడా ప్రారంభమైంది. అప్పుడే ఆర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ ఛానల్ ఓపెన్ చేయడం, ఎన్ డీ టీవీ ని కొట్టేయడం వెంట వెంటనే జరిగిపోయాయి. దీని తర్వాత ఎన్డిటీవీలో వాటాలను గౌతమ్ ఆదాని కొనుగోలు చేయడంతో ఇక అది బిజెపి గొంతును అనుకరించడం మొదలుపెట్టింది. గౌతమ్ అదాని ఎప్పుడైతే ఛానల్లో పెట్టుబడి పెట్టాడో అప్పుడే కాంగ్రెస్ అనుకూల జర్నలిస్టులు అందరూ బయటకు వెళ్లిపోయారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ మీద ఫోకస్ పెట్టే ఛానల్ లేకపోయింది. టైమ్స్ నౌ ఉన్నప్పటికీ బిజెపి మీడియాతో పోలిస్తే కాంగ్రెస్ కు వాయిస్ తగ్గిపోయింది. మరోవైపు జాతీయస్థాయిలో జి మీడియా నుంచి మొదలుపెడితే రిపబ్లిక్ టీవీ వరకు బిజెపి అనుకూల వార్తలే ఎక్కువగా ప్రసారం అవుతున్నాయి. ఇక టైమ్స్ నౌ మొదటి నుంచి కాంగ్రెస్ ఫోల్డ్ లో ఉన్న మీడియా కాబట్టి.. కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ తరపున వాయిస్ మరింత బలంగా వినిపిస్తోంది. అయితే అటువంటి ఆ చానల్ ఎడిటర్ రాజీనామా చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
రాహుల్ శివశంకర్ అవుట్
మొన్ననే టైమ్స్ నౌ గ్రూపు రెండు ముక్కలుగా చీలిపోయింది. అన్నదమ్ములు ఇద్దరూ తమ ఆస్తులను పంచుకున్నారు.. ఈ క్రమంలో టైమ్స్ నౌ ఛానల్ పెద్ద సోదరుడికి వెళ్లిపోయింది. అయితే అంతా సాఫీగా జరుగుతోంది అనుకుంటున్న క్రమంలో టైమ్స్ ఛానల్ నుంచి ఎడిటర్ ఇన్ చీఫ్ వైదొలిగాడు. బుధవారం నుంచి తాను విధుల్లోకి రాబోనని స్పష్టం చేశాడు. అంతేకాకుండా ఎడిటోరియల్ తో పాటు ఛానల్ కు సంబంధించిన అన్ని గ్రూపుల్లో తన రాజీనామాకు సంబంధించిన లేఖను పోస్ట్ చేశాడు. దీంతో టైమ్స్ నౌ ఛానల్ లో ఒక్కసారిగా కలకలం నెలకొంది. కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన అనంతరం కాంగ్రెస్ పార్టీ దేశంలోనూ అధికారంలోకి వస్తుందనుకుంటున్న తరుణంలో, తమకు మంచి రోజులు వస్తాయనుకుంటున్న సందర్భంలో ఎడిటర్ ఇన్ చీఫ్ ఇలా రాజీనామా చేయడం టైమ్స్ నౌ ఛానల్ కు మింగుడు పడటం లేదు.
రాహుల్ శివశంకర్ కు జాతీయ రాజకీయాలపై విపరీతమైన పట్టు ఉంది. పైగా కొన్ని కొన్ని జాతీయ స్థాయి విషయాల్లో ఎక్స్క్లూజివ్ రిపోర్టింగ్ ఇవ్వడంతో టైమ్స్ నౌ ఒకానొక సందర్భంలో జాతీయస్థాయిలో రెండవ స్థానంలోకి వెళ్లిపోయింది.. ఇప్పటికి కూడా టాప్_5 లో కొనసాగుతోంది.. అయితే శివ శంకర్ రాజీనామాకు కారణాలు తెలియక పోయినప్పటికీ.. అంతర్గత పోరు ఆయనను ఇబ్బంది పెట్టిందని ఢిల్లీ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన తన భవిష్యత్తు లక్ష్యాల గురించి స్పష్టం చేయకపోయినప్పటికీ.. త్వరలో ఆయన జీ మీడియాలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. జీ మీడియా కూడా ఆయనకు కనివిని ఎరగని స్థాయిలో ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. శివశంకర్ 2005లో టైమ్స్ నౌ గ్రూపులో చేరారు.. మంచి జర్నలిస్టుగా పేరు సంపాదించారు. ఇదే సమయంలో ఆర్నాబ్ గోస్వామి టైమ్స్ నౌ గ్రూపులో చేరడం, ఆయన దూకుడు జర్నలిజం ప్రదర్శించడంతో రాహుల్ శివశంకర్ తట్టుకోలేక న్యూస్ ఎక్స్ అనే ఛానల్ లో ఎడిటర్ ఇన్ చీఫ్ గా చేరాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు అర్నబ్ టైమ్స్ లో నుంచి బయటికి వెళ్లిపోవడంతో తిరిగి రాహుల్ శివశంకర్ ఆ ఛానెల్ లోకి వచ్చాడు. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా ఎడిటర్ ఇన్ చీఫ్ గా అందులోనే పనిచేస్తున్నాడు.
కొత్త ఎడిటర్ గా నావికా కుమార్
ఇక రాహుల్ శివశంకర్ రాజీనామాతో కొత్త ఎడిటర్ ఇన్ చీఫ్ గా నావికా కుమార్ ను టైమ్స్ యాజమాన్యం నియమించింది. ఈమె వివాదాస్పద జర్నలిస్టు. గత కొంతకాలం నుంచి నావికా కుమార్ దూకుడు జర్నలిజంతో దూసుకు వెళ్తున్నారు. భారతదేశానికి సంబంధించి అంతర్జాతీయంగా తల వంపులు తీసుకొచ్చిన ఒక సంఘటనకు ఈమె బాధ్యురాలని అప్పట్లో ప్రచారం జరిగింది. మత విద్వేషాలను రెచ్చగొట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కేసులు కూడా నమోదయ్యాయి. బిజెపి అంటే విపరీతమైన ద్వేషం ప్రదర్శించే నావికా కుమార్.. తమ ఛానల్ ను అగ్ర పథంలో నడిపిస్తుందని టైమ్స్ నౌ గ్రూప్ అభిప్రాయపడుతోంది. రాహుల్ శివశంకర్ బయటికి వెళ్లిపోవడం లో నావికా కుమార్ కీలకపాత్ర పోషించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈమె దూకుడు జర్నలిజం వల్ల అతడు కొన్ని విషయాల్లో తలదించాల్సి వచ్చింది. అటు యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో తాను ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకొని ఆయన రాజీనామా చేశారు. ఇక నావికా కుమార్ కు రాహుల్ గాంధీ టీమ్ లో పనిచేసే కొప్పుల రాజుతో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతోపాటు కమ్యూనిస్టుల్లో ఓవర్గం కూడా నావికా కుమార్ కు అండదండలు అందిస్తోంది. ఇవన్నీ కూడా తమ ఫోల్డ్ కు సంబంధించినవి కావడంతో టైమ్స్ నౌ గ్రూప్ కూడా నావికా కుమార్ వైపు మొగ్గు చూపింది.